
'కొమన్' విలయం: తూర్పు భారతం కకావికలం
కోల్కతా: ఇప్పటికే దాదాపు ఏడు లక్షల మంది నిరాశ్రయిలయ్యారు. 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. తిండికాదు కదా కనీసం గుక్కెడు మంచినీరూ కరువయ్యింది. ఇటు తాత్కాలిక సహాయ శిబిరాల్లో వసతుల లేమి.. చిన్నారులు, వృద్ధుల ఆక్రందనలు.. ఇవీ.. గడిచిన మూడు రోజులుగా తూర్పు భారతంలోని పశ్చిమ బెంగాల్, మణిపూర్, ఒడిశా, అసోం జార్ఖండ్ రాష్ట్రాల్లోని కొన్ని భాగాల్లో కొమన్ తుఫాను సృష్టించిన విలయం తాలూకు ఆనవాలు.
జులై 30న తీరం ఇండో- మయన్మార్ సరిహద్దు వద్ద తీరం దాటిన కొమన్ పెనుతుఫాన్.. అటు మయన్మార్ తోపాటు బెంగాల్, మణిపూర్, ఒడిశా రాష్ట్రాల్లో గడిచిన 200 ఏళ్లలో కనీవినీ ఎరుగతి రీతిలో నష్టాన్ని మిగిల్చింది. కోల్ కతా నగరంలో శనివారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అక్కడ 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఆ రాష్ట్రంలోని మరో 12 జిల్లాల్లో తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నది.
భారీ వర్షాల ధాటికి మణిపూర్ లో శనివారం కొండచరియలు విరిగిపడి 20 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మయన్మార్ సరిహద్దుల్లోని మోరేకు రాజధాని నగరం ఇంఫాల్ తో రవాణా సంబంధాలు తెగిపోయాయి. దీంతో సహాయక చర్యల్లో తీవ్ర అంతరాయం నెలకొంది.
ఒడిశాలోని చక్పితోపాటు మరో రెండు ప్రధాన నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఒక్క ఒడిశాలోనే ఐదు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జార్ఖండ్ లోని గిరిధి, ఛత్రా జిల్లాలు కూడా కొమన్ బారినపడి తీవ్ర ఆస్థి నష్టాన్ని చవిచూశాయి. జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ బలగాలు సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి.