
ఆధునిక దేవాలయానికి 60 ఏళ్లు
‘‘ఇది భారత ప్రజా సౌభాగ్య మందిరానికే శంకుస్థాపన. ఈనాడు మనం ఆసేతుహిమాచల పర్యంతం నిర్మించుకుంటున్న నవ దేవాలయాలకు ఇది చిహ్నం’’..
నాగార్జునసాగర్‌కు పునాదిరాయి పడింది ఈ రోజే
♦ పూర్తిగా మానవశక్తితో నిర్మించిన మహా ప్రాజెక్టు
♦ ఉభయ రాష్ట్రాల అన్నపూర్ణ.. పసిడి పంటల చిరునామా
♦ ప్రాజెక్టుకు తొలి ప్రధాని, కాలువలకు ఇందిర శంకుస్థాపన
♦ ఆధునీకరణ పూర్తి కాకపోవడంతో నేటికీ చేరని ఆయకట్టు లక్ష్యం
నాగార్జునసాగర్: ‘‘ఇది భారత ప్రజా సౌభాగ్య మందిరానికే శంకుస్థాపన. ఈనాడు మనం ఆసేతుహిమాచల పర్యంతం నిర్మించుకుంటున్న నవ దేవాలయాలకు ఇది చిహ్నం’’.. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన సంద ర్భం గా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసి న వ్యాఖ్యలివీ! తెలుగు నేలను పసిడిమయం చేసే దిశగా 1955, డిసెంబర్ 10న నెహ్రూ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ఆధునిక దేవాలయానికి గురువారంతో సరిగ్గా 60 ఏళ్లు నిండనున్నాయి. ఆనాడు నెహ్రూ కన్న కలలను నిజం చేస్తూ కోట్లాది మంది ప్రజలకు జీవనాధారంగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అన్నపూర్ణగా ఈ ప్రాజెక్టు విరాజిల్లుతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తిస్థాయిలో మానవశక్తితో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది.
సాగునీటి కోసం కుడి, ఎడమ కాలువలను నిర్మించారు. కుడికాలువను జవహర్ కాలువగా, ఎడమ కాలువను లాల్‌బహుదూర్ కాలువగా పిలుస్తారు. జవహర్ కాలువ సాగర్ రిజర్వాయర్ నుంచి ఆనకట్టకు కుడివైపు నుంచి ప్రారంభమవుతుంది. ఈ కాలువ పనులను అప్పటి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 10 అక్టోబర్ 1956న ప్రారంభించారు. దక్షిణ విజయపురి వద్ద ఈ కాలువ సొరంగ మార్గం ప్రారంభమై 392 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. దీని ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లా ల్లో 11.74 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. 132 టీఎంసీల నీటిని కేటాయించారు. రిజర్వాయర్ ఎడమ వైపు నుంచి ప్రారంభమయ్యే కాలువ... పొట్టిచెలమ నుంచి చల కుర్తి వరకు సొరంగమార్గం ద్వారా ప్రయాణిస్తుంది.
ఈ కాలువ నిర్మాణ పనులను నాటి గవర్నర్ భీమ్‌సేన్ 1959లో ప్రారంభించారు. దీని పొడవు 349 కిలో మీటర్లు. దీని కింద 10.37 లక్షల ఎకరాలను స్థిరీకరించారు. 132 టీఎంసీలను కేటాయించారు. రిజర్వాయర్ నీటిమట్టం 489 అడుగుల పైన ఉన్నప్పుడు కుడి కాలువ లాగే ఈ కాలువకు కూడా నీటిని విడుదల చేయొచ్చు. సాగర్ ప్రాజెక్టు ఒకసారి నిండితే ప్రభుత్వానికి రూ.3 వేల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా. నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1967, ఆగస్టు 4న కుడి, ఎడమ కాలువలకు నీటిని వదిలారు.
దేదీప్యమానంగా ప్రాజెక్టు
60 ఏళ్ల సాగర్ అందంగా ముస్తాబైంది. శంకుస్థాపన పిల్లర్‌తోపాటు డ్యాం ప్రధాన ద్వారాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. డ్యాంపై 22, 41 బ్లాకు వద్ద సిగ్నల్స్ కోసం ఏర్పా టు చేసిన శిఖరాలకు దీపాలంకరణ చేశారు. గురువారం ఉదయం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించనున్నారు. అయితే ప్రత్యేక నిధులు లేకపోవడంతో షష్టిపూర్తి ఉత్సవాలు లేనట్లేనని అధికారులు చెబుతున్నారు.
అప్పటి లక్ష్యం నేటికీ చేరని వైనం
సాగర్ ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నేటికీ నెరవేరలేదు. నాడు తవ్విన కాల్వలు, సిమెంటు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రస్తుతం కాలువల చివరి భూములకు నీరు చేరే పరిస్థితి లేదు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సాగర్‌లో స్వర్ణోత్సవాలు జరిపారు. కాలువల ద్వారా చిట్టచివరి ఎకరం కూడా తడవాలన్న ఉద్దేశంతో సాగర్ ప్రాజెక్టు ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. ప్రపంచబ్యాంకు నిధులు మంజూరు కాకున్నా వాటి కోసం ఎదురుచూడకుండా పనులు మొదలు పెట్టారు. ఆయన మరణం తర్వాత ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరైనా ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.1600 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు రూ.900 కోట్ల పనులు పూర్తయ్యాయి. మరో రూ.200 కోట్లు చెల్లిస్తే పనులు పూర్తికానున్నాయి. మెయిన్ కెనాల్స్ పనులు 90 శాతం పూర్తికాగా పంట కాల్వల పనులు కేవలం 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి.
రెండు పంటలకు చాలని నీరు
నాగార్జునసాగర్ జలాశయంతో పాటు ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయంలో పూడిక చేరడంతో రెండు పంటలకు నీరు సరిపోవడం లేదు. దీనికితోడు నీటి విడుదల ఆలస్యం కావడంతో కొన్నిసార్లు నీరు వృథాగా పోతోంది. ఇప్పటికీ ఏ తూము ద్వారా ఎంత నీటిని విడుదల చేస్తే ఎన్ని ఎకరాలు పారుతుందన్న కచ్చితమైన సమాచారం అధికారుల వద్ద లేదు. ఇన్నేళ్లకు కూడా నేటికీ చివరి భూములకు నీరు చేరడం లేదంటే అధికారుల పనితీరును అర్థం చేసుకోవచ్చు.