'మంచి' దొంగ పోలీసులకు చిక్కాడు | 61-Year-Old Mumbai Conman Robbed Foreigners, But Sent Passports Back: Police | Sakshi
Sakshi News home page

'మంచి' దొంగ పోలీసులకు చిక్కాడు

Published Thu, Oct 15 2015 4:21 PM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM

'మంచి' దొంగ పోలీసులకు చిక్కాడు - Sakshi

'మంచి' దొంగ పోలీసులకు చిక్కాడు

ప్రయాణాల్లోనూ, టూర్లలోనూ లగేజీ పోగొట్టుకుంటుంటాం. అలాగే వాల్యుబుల్స్ ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ ఒక్కోసారి ఎక్కడో పెట్టి మర్చిపోవడమో, ఎవరైనా దోచేయడమో జరుగుతుంటుంది. అయితే అటువంటప్పుడు కనీసం బ్యాగ్ దొరికిన వారు అందులోని డబ్బు, బంగారం వంటివి ఇవ్వకపోయినా... పాస్పోర్ట్ సర్టిఫికెట్లు, ఫోన్ డేటా వంటి అత్యవసరమైనవైనా తిరిగి ఇచ్చేస్తే బాగుండునని ఎంతగానో అనుకుంటాం.

 అయితే దొంగల్లోనూ కొందరు సిన్సియర్లు ఉంటారని, వారు అలాకూడా చేస్తారని మీరు ఎప్పుడైనా విన్నారా? తాజాగా ముంబైలో అటువంటి ఓ మా మంచి దొంగ పోలీసులకు చిక్కాడు. తనకు కావలసినదేదో తీసుకొని విలువైన పత్రాలు, సర్టిఫికెట్లను నిజాయితీగా యజమానికి అప్పగించే అలవాటున్న ఆ 61 ఏళ్ళ మంచిదొంగను.. ఓ చోరీకి పాల్పడుతుండగా పోలీసులు కాపు కాసి పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే ...ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) ఓ 61 ఏళ్ళ వయసున్న వింత దొంగను అరెస్ట్ చేశారు. ఎన్నారైలను మాత్రమే టార్గెట్ చేసి వారివద్ద ఉన్న విలువైన వస్తువులను తస్కరించడంలో మంచి హస్త లాఘవం ఉన్న కిషోర్ సుబ్రహ్మణ్యన్ మద్దాలి అనే దొంగను చాకచక్యంగా పట్టుకొన్నారు. అతనివద్ద నుంచీ ఐదుగురు విదేశీయులకు సంబంధించి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు కిషోర్ సుబ్రహ్మణ్యం టార్గెట్ కేవలం ఫారెనర్లే. వారిని తన మాటలతో  మస్కాకొట్టించి,  నమ్మకం కలిగించి మెల్లగా వారి బ్యాగ్లను కొట్టేయడం కొన్నేళ్ళుగా అతని అలవాటుగా మారింది. అయితే ఆ బ్యాగుల్లో వారికి సంబంధించిన పాస్పోర్టులు వంటివి ఉంటే మాత్రం వారికి ఎలాగైనా తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నించడం ఈ దొంగగారి ప్రత్యేక లక్షణం. అయితే ఎన్నో ఏళ్ళుగా ఈ వ్యవహారం  జరుగుతున్నా బయటపడలేదు గానీ, తాజాగా సౌదీ అరేబియాకు చెందిన దేవదాసన్ శివరామ్ సోనారికి చెందిన పాస్పోర్ట్ ను తిరిగి ఇవ్వడం ఈ మంచిదొంగ పీకకు చుట్టుకుంది. దేవదాసన్ సోనారీ మంగుళూరు ఎక్స్ప్రెస్ ఎక్కుతుండగా బ్యాగ్ ను కొట్టేసిన మద్దాలి... తర్వాత అతని అడ్రస్ ట్రేస్ చేసి మరీ పాస్పోర్టును అందేలా చేశాడు.

''మేం మొత్తం ఐదుగురికి చెందిన విలువైన వస్తువులను మద్దాలి నుంచీ స్వాధీనం చేసుకున్నాం. అతని మరిన్ని దొంగతనాలకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నాం. నిందితుడికి తెలుగు, మలయాళం, తమిళ్, ఇంగ్లీష్, హిందీ భాషలతోపాటు మరాఠీ కూడా బాగా తెలుసు. అంతేకాదు అతడు బీఎస్సీ గ్రాడ్యుయేట్ కూడా.'' అని జీఆర్పీ పోలీస్ ఇనస్పెక్టర్ మానిక్ సాథీ తెలిపారు. గతంలో 24 ఏళ్ళ నైజీరియాకు చెందిన రుకో మిగా  పాస్పోర్టును కూడ మద్దాలి తిరిగి ఇచ్చేశాడు. అతడు చెన్నై మెయిల్ ఎక్కుతుండగా అతగి బ్యాగ్ను ఓ ల్యాప్టాప్, ఏభై వేల రూపాయల క్యాష్తో పాటు తస్కరించాడు. అయితే ఆ తర్వాత అతడి నెంబర్ యూనివర్శిటీ  ద్వారా వివరాలు తెలుసుకొని అతడికి పాస్పోర్ట్ చేరేలా చేశాడు.

అయితే తరచుగా వస్తున్న ఫిర్యాదులపై దృష్టి సారించిన పోలీసులు మద్దాలిని పట్టుకునేందుకు వల పన్నారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో సన్ గ్లాస్లు, క్యాప్ పెట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గమనించారు. అయితే సీసీ కెమెరాలో క్యాప్, కళ్ళజోడు లేకపోవడంతో అతడు మద్దాలి అవునా కాదా అని కాస్త సంశయించారు. కాపు కాసి  సివిల్ డ్రస్లో ఉన్న పోలీసులు ...ఓరోజు పధ్నాలుగో నెంబర్ ప్లాట్ ఫాం పైకి మంగుళూరు ఎక్స్ ప్రెస్ వచ్చిన వెంటనే ఒకరి నుంచి బ్యాగ్ ను కొట్టేందుకు ట్రై చేస్తున్న మద్దాలిని పట్టుకున్నారు. అయితే మద్దాలి బాధితులను బ్రెయిన్ వాష్ చేసిన తీరు మాత్రం పోలీసులకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. అతడు దొంగ అంటే నిజానికి బాధితులే నమ్మలేని పరిస్థితి కనిపించడంతో అతడి హస్త లాఘవ నైపుణ్యానికి విస్తుపోయిన పోలీసులు ఎట్టకేలకు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవాడైన మద్దాలి ముంబైలోని టెక్స్టైల్ ఫ్యాక్టరీ లో పనిచేసేవాడు. 58 ఏళ్ళకు మద్దాలి రిటైర్ అయిన తర్వాత తాగుడుకు అలవాటు పడటంతో అతని భార్య కొడుకుతోపాటు అతడిని వదిలి వెళ్ళిపోయింది. చివరికి తాగేందుకు డబ్బులేక మద్దాలి దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ముఖ్యంగా విదేశీయులను టార్గెట్ చేసే మద్దాలి... ముందుగా వారిని మాటల్లో పెట్టి, మంచి తనంతో నమ్మించి.. ఆ తర్వాత హెల్స్ చేస్తానంటూ వారు వాష్రూమ్ కు వెళ్ళిన సమయంలో లగేజీ జాగ్రత్తగా చూస్తానంటూ నమ్మించి ట్రైన్ నుంచి పరారయ్యే వాడు. ఇంగ్లీష్ భాషలో ఎంతో కమాండ్ ఉన్నమద్దాలి  వారిని ఆ భాషతోనే చాకచక్యంగా బుట్టలో వేసుకొని వారి లగేజీనుంచీ ఓ బ్యాగ్ ను తీసుకొని పరుగు లంకించేవాడు. తాను కూడా ప్రయాణీకుడినంటూ మిగిలిన వారిని నమ్మించేందుకు.. మద్దాలి తన చేతిలో కూడా ఎప్పుడూ ఓ బ్యాగ్ను పట్టుకొని తిరిగేవాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement