
ఎనభై ఏళ్ళ వృద్ధుడి సృష్టి... డాగ్ ట్రైన్
తొమ్మిది బోగీలున్న ఓ చిన్నపాటి ట్రయిన్ ఇప్పుడా పట్టణంలో అందరినీ ఆకర్షిస్తోంది. దానిపేరు డాగ్ ట్రైన్. కుక్కలను సరదాగా రైడింగ్ కు తీసుకెళ్ళేందుకు ఓ జంతు ప్రేమికుడి సృష్టి అది. టెక్సాస్ లోని ఫోర్ట వర్త్ గ్రామంలో తిరుగుతున్న ఆ బుజ్జి రైలు... అక్కడివారినే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకట్టుకుంటోంది.
పదవీ విరమణ అనంతరం వ్యవసాయంలో స్థిరపడ్డ ఎనభై ఏళ్ళ వృద్ధుడు బోస్టిక్. నిరాశ్రయులకు, జంతువులకు స్నేహితుడుగా ఉంటూ, గ్రామంలో సెలబ్రిటీగా మారాడు. తన వద్ద ఉన్న తొమ్మిది పెట్స్ ఒకేసారి వాక్ చేసేందుకు వీలుగా ఓ కొత్తరకం రైలును సృష్టించి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు.
బోస్టిక్.. పదిహేనేళ్ళ నుంచి స్వగ్రామమైన ఫోర్ట్ వర్త్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో వీధికుక్కలను చేరదీసి పెంచుతున్నాడు. వీధి చివరిలో ఉండే ఇంట్లో బోస్టిక్... అతడి సోదరుడూ నివాసం ఉంటారు. అయితే ఇతడు జంతుప్రేమికుడ్న విషయం తెలిసో ఏమో... చాలామంది వీధికుక్కలను సైతం ఇతడి ఇంటివద్ద వదిలి వెళ్ళిపోతుంటారు. దీంతో బోస్టిక్ వాటిని చేరదీసి వాటికి ఆహారం అందించడంతోపాటు, అవి నివసించేందుకు వీలుగా సౌకర్యాలు కూడ కల్పిస్తుంటాడు.
తనవద్ద ఉన్న కుక్కలను వాకింగ్ కు తీసుకెళ్ళడం కూడ అలవాటు చేశాడు బోస్టిక్... అయితే ఇంట్లో పెంచుకునే ఒక్కదాన్నివాకింగ్ కు తీసుకెళ్ళేందుకే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. తొమ్మిది కుక్కలను ఒకేసారి తీసుకెళ్ళడం అంటే మాటలా? అతడికి అదో పెద్ద ఛాలెంజింగ్ గా మారింది. ఎన్నోసార్లు పెంపుడు కుక్కల నిపుణులతో చర్చించాడు. ఐదు కుక్కలే ఉన్నపుడు అన్నింటినీ ఒకేసారి తన ట్రాక్టర్ లో బయటకు తీసుకెళ్ళేవాడు. అవి తొమ్మిదికి చేరిన తర్వాత వాటి రైడింగ్ కోసం బోస్టిక్ పలు విధాలుగా ఆలోచించాడు.
ఒకరోజు ట్రాక్టర్ కు రాళ్ళను తగిలించి లాగడాన్ని గమనించాడు. అప్పుడే బోస్టిక్ కు డాగ్ ట్రైన్ తయారు చేయొచ్చన్న థాట్ వచ్చింది. అతడు స్వతహాగా మంచి వెల్డర్ కూడ కావడంతో.. అనుకున్నదే తడవుగా ప్లాస్టిక్ డ్రమ్ములకు రంధ్రాలు చేసి చక్రాలను అమర్చి ఒకదానికొకటి కట్టి, తక్కువ ఖర్చుతో ఓ కొత్త రకం ట్రైన్ ను తయారు చేశాడు. తొమ్మిది కుక్కలూ ఒకేసారి వాకింగ్ కు వెళ్ళేందుకు వీలుగా ఉన్న ఆట్రైన్ ను ఆ పెంపుడు జంతువులు కూడ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాయి. ట్రైన్ ను చూడగానే వాకింగ్ కు వెళ్ళేందుకు సిద్ధమై... ఇబ్బంది పెట్టకుండా ఉత్సాహంగా ఒక్కోసీట్లో ఒక్కోటి ఎక్కి కూచోవడం ప్రారంభించాయి.
డాగ్ ట్రైన్ చూసి స్థానికులు కూడ ఎంతో మురిసిపోతున్నారు. వారానికి రెండ్రోజులు తోకలూపుకుంటూ హ్యాపీగా ఆ పెట్ డాగ్స్ సంతోషంగా తిరిగి వస్తున్నాయి. ''నాకిప్పటికే ఎనభై ఏళ్ళు వచ్చాయి. ఇలా ఈ జంతువుల సంరక్షణ ఎంతకాలం నేను కొనసాగించగలనో తెలియదు. కానీ నేనున్నంతకాలం మాత్రం వీటి సంరక్షణకు ఏమాత్రం లోటు చేయను'' అంటున్నాడు బోస్టిక్. బోస్టిక్ సంరక్షణలో పెరుగుతున్న ఆ పెట్ డాగ్స్ ఎంత అదృష్టం చేసుకున్నాయో..