గత స్మృతుల్లో ఆ పార్క్లో అధ్యక్షుడిగా..
న్యూయార్క్: మరో పద్దెనిమిది నెలలు పదవి కాలం. ఇలోగా చేయాల్సిన పనులు ఎన్నో. ఒక దేశ అధ్యక్షుడికి ప్రజల సంక్షేమం కోసం తానేం చేయగలనని నిత్యం ఆలోచన. దేశ వ్యవహారాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చలు... పొరుగు దేశాలతో సత్సంబంధాల కోసం ఆయా దేశాల ప్రతినిధులతో సమావేశాలు. సమస్యలను ఛేదించేందుకు వ్యూహాలు. మరోపక్క, కుటుంబం, పిల్లలతో గడిపే కార్యక్రమాలు. ఇవన్నీ ఒకే పదవిలో ఉండి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. గత కొద్ది రోజులుగా తన అధికారిక కార్యాలయంలో నిత్యం బిజీగా ఉంటున్న ఆయన శనివారం ఎందుకో సేదతీరాలనుకున్నారు.
అది కూడా పక్కన రక్షణ సిబ్బంది లేకుండా. స్వేచ్ఛగా విహరించాలన్న ఆలోచన సాధారణ వ్యక్తిగా ఒబామాకు ఉండొచ్చుగానీ, నియమ నిబంధనల ప్రకారం ఓ అగ్రరాజ్య నేత ఒంటరిగా వెళ్లేందుకు ఎవరైనా ఒప్పుకుంటారా.. అందుకే ఆయన నడుస్తుంటే గగన తలంలో రక్షణగా హెలికాప్టర్లు.. ఆయనకు కొంచెం దూరంలో రక్షణ వలయంగా స్కూటర్లపై సీక్రెట్గా సెక్యూరిటీ సిబ్బంది.. పక్కన ఆయన కూతురు. ఇదంతా శనివారం సెంట్రల్ పార్క్లో దృశ్యం.
సెక్యూరిటీని పక్కకు పెట్టి సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపాలనకోవడం ఒబామాకు ఇదే తొలిసారి కాదు. కానీ సెంట్రల్ పార్క్లో విహరించడం మాత్రం అధ్యక్షుడు అయిన తర్వాత తొలిసారి. ఎందుకంటే, ఆయన 1980లో కొలంబియా విశ్వవిద్యాలయంలో చదివినప్పుడు మాత్రం విహరించారట. నాడు విద్యార్థిగా ఉండి ఆ పార్క్లో సరదాగా గడిపిన ఆయన అధ్యక్ష స్థానంలో ఉండి విహరిస్తే ఎలా ఉంటుందోనన్న ఆలోచనతో తన కూతురుని వెంటబెట్టుకుని పార్క్లో కలియదిరుగుతూ సందడి చేశారు. పదవి కాలం పూర్తయ్యాక ఏమేం చేయాలన్న ఆలోచన కూడా అప్పుడే చేశారంట. ఆ ఆలోచనల్లోనే వీలైనన్నీ ప్రాంతాల్లో ఎలాంటి సెక్యూరిటీ పక్కన లేకుండా స్వేచ్ఛగా విహరించాలని ఉందంట.