కేజ్రివాల్ కు 'ఆమ్ ఆద్మీ' ఎమ్మెల్యే డెడ్ లైన్!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పై ఆమీతుమీ తేల్చుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ సిద్ధమవుతున్నారు. తాజాగా ఎన్నికల చేసిన వాగ్గానాలను నెరవేర్చడానికి బిన్నీ డెడ్ లైన్ విదించారు. ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే తాను జనవరి 27 తేది నుంచి నిరవధిక దీక్ష చేపడుతానని బిన్నీ హెచ్చరించారు. ఎన్నికల్లో చేసిన వాగ్ధానాలను తుంగలో తొక్కుతున్నారని పార్టీ నేతలపై, ప్రభుత్వంపై మండిపడ్డారు.
ప్రజలకిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో విఫలమవుతున్న కేజ్రివాల్ ప్రభుత్వ తీరుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జనవరి 27 తేదిన దీక్షను చేపడుతానని గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. అన్నా హజారే జన లోక్ పాల్ బిల్లును జనవరి 25 లేదా 26 తేదిల్లో ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళల రక్షణకు మహిళా కమాండో ఫోర్స్ రూపొందించాలన్నారు.
కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన కేజ్రివాల్ ఆ రెండు పార్టీలకు ఎలా భిన్నమో ప్రజలు తెలుపాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ కు విధానాలను వ్యతిరేకించిన కేజ్రివాల్.. ప్రస్తుతం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ కిషన్ తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. లోకసభ సీటు కేటాయించనందుకే తనతో విభేధిస్తున్నారని కేజ్రివాల్ చేసిన ఆరోపణలు బిన్ని ఖండించారు.