
కాంగ్రెస్ కనుసన్నల్లో కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యవస్థాపకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై తిరుగుబాటు ప్రకటించిన లక్ష్మీనగర్ ‘ఆప్’ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ గురువారం ‘ఆప్’ సర్కారుపైన, కేజ్రీవాల్‌పైన మరిన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఆప్’ సర్కారు పూర్తిగా కాంగ్రెస్ కనుసన్నల్లో నడుస్తోందని, కేజ్రీవాల్ అహంకారి, నియంత అని ఆరోపించారు. జన్‌లోక్‌పాల్ బిల్లు, మంచినీరు, విద్యుత్ చార్జీలు, మహిళల భద్రత తదితర అంశాలపై ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ‘ఆప్’ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను దగా చేస్తోందని దుయ్యబట్టారు. బిన్నీ ఉదయం 10 గంటలకు మీడియా సమావేశం నిర్వహించారు. ‘ఆప్’ నలుగురు మిత్రుల పార్టీగా మారిపోయిందని ఆరోపించారు.
అయితే, తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తన ఆరోపణలు అసత్యమని తేలితే పార్టీ నుంచి తప్పుకుంటానన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం కేజ్రీవాల్ నెరవేర్చకుంటే, ఈ నెల 27 నుంచి నిరశన దీక్ష ప్రారంభిస్తానని హెచ్చరించారు. అయితే, బిన్నీ ఆరోపణలను ‘ఆప్’ ఖండించింది. లోక్‌సభ టికెట్టు దక్కకపోవడంతోనే ఆయన ఆరోపణలకు దిగుతున్నారని దుయ్యబట్టింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది.
కాంగ్రెస్ ఆదేశిస్తోంది... కేజ్రీవాల్ పాటిస్తున్నారు: బిన్నీ
‘ఆప్’ ప్రభుత్వం కాంగ్రెస్‌తో కుమ్మక్కయింది. అందుకే మాజీ సీఎం షీలా దీక్షిత్, ఆమె హయాంలో పనిచేసిన మంత్రుల అవినీతిపై దర్యాప్తు చేపట్టలేదు.
ఎవరికీ మద్దతు ఇవ్వబోము, తీసుకోబోము అని ప్రకటించిన ‘ఆప్’... కాంగ్రెస్ మద్దతుతో ఎందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయి. ఇప్పుడు లోక్‌సభ అభ్యర్థుల విషయంలోనూ పార్టీ అడ్డదారులు తొక్కుతోంది.
షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్, కేజ్రీవాల్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ జారీ చేస్తున్న ఆదేశాలను కేజ్రీవాల్ అమలు చేస్తున్నారు.
కేజ్రీవాల్ ఎవరి మాటా వినిపించుకోరు. తన నిర్ణయాలను వ్యతిరేకించే వారిని తొలుత నచ్చజెబుతారు. అయినా వినకుంటే మండిపడతారు.
కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, కుమార్ విశ్వాస్‌లు బాల్యమిత్రులు. పార్టీలో వారి మాటే చలామణి అవుతోంది.
అన్నా హజారే, కిరణ్ బేడీ సహా ఎందరినో అవసరానికి వాడుకుని విడిచిపెట్టేసిన పార్టీ ‘యూజ్ అండ్ త్రో’ విధానాన్ని పాటిస్తోంది.
అధికారంలోకి వచ్చాక కేజ్రీవాల్‌కు అధికార కాంక్ష పెరిగింది. నేనెన్నడూ కేజ్రీవాల్‌ను లోక్‌సభ టికెట్టు అడగలేదు. ఆయన అబద్ధమాడుతున్నారు.
ఆరోపణలు దిగ్భ్రాంతికరం: ‘ఆప్’ నేతలు
ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ ఆరోపణలను ‘ఆప్’ ఖండించింది. బిన్నీ ఆరోపణలపై ‘ఆప్’ నేత యోగేంద్ర యాదవ్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు...
బిన్నీ ఆరోపణలు మాకు తీవ్ర దిగ్భ్రాంతిని, క్షోభను కలిగించాయి. లోక్‌సభ టికెట్టు దక్కనందునే ఆయన పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు.
బిన్నీ ఆరోపణలన్నీ బీజేపీ ప్రసంగాన్ని చదివినట్లే ఉన్నాయి. పార్టీ సమావేశాల్లో ఒక్కసారైనా ప్రస్తావించని అంశాలను నేరుగా మీడియా ముందుంచడం ఏ మేరకు సమంజసం?
{Mమశిక్షణారాహిత్యాన్ని పార్టీ సహించబోదు. బిన్నీకి షోకాజ్ నోటీసు పంపి, సంజాయిషీ కోరతాం. ఆయనపై క్రమశిక్షణ చర్యలు చేపడతాం.
ఆదర్శవాదం పోయింది: అరుణ్ జైట్లీ (బీజేపీ)
ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన మూడు వారాల్లోనే ‘ఆప్’లో ఆదర్శవాదం కనుమరుగై, పదవీకాంక్ష మొదలైంది. ప్రత్యామ్నాయ రాజకీయాల హామీతో ‘ఆప్’ ఆవిర్భవించినప్పుడు, అది సమాజంపై గట్టి ప్రభావం చూపగలదని నేను ఆశించా. అయితే, అది జిమ్మిక్కులను ప్రదర్శిస్తూ అరాచకవాదం వైపు మళ్లుతోంది.