తోమర్ ఇక ఇంటికేనా!
న్యూఢిల్లీ: అవినీతి, అన్యాయం, మోసం,లంచం వంటి అంశాలపై సమరశంఖం పూరించి ప్రత్యేక పార్టీని నెలకొల్పి విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్.. తన ప్రభుత్వం విషయంలో కూడా అంతే నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. తన పార్టీకి కలంకం తీసుకొచ్చిన న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, అరెస్టు వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు. మోసం చేసిన తోమర్ ను ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ మేరకు కసరత్తు పూర్తి చేసినట్లు కూడా సమాచారం. శుక్రవారం దీనిపై నిర్ణయం కూడా తీసుకోనున్నట్లు కీలక సమాచారం.
బీహార్లోని తిలక్ మాంఝీ భాగల్పూర్ యూనివర్సిటీలో తాను చదివినట్లు మంత్రి తోమర్ సర్టిఫికెట్ చూపించగా.. అది నకిలీదని పేర్కొంటూ సదరు యూనివర్సిటీ తన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. న్యాయశాఖ మంత్రి తోమర్ విద్యార్హత సర్టిఫికెట్లన్నీ నకిలీవేనని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఆ తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పోలీసులు తోమర్ ను అరెస్టు చేయడంతో కేజ్రీవాల్ సర్కార్ విమర్శల పాలయింది. కేజ్రీవాల్ కు ఈ అంశ తల నొప్పిగా మారింది. ఇక వేరే దారి లేక తోమర్ ను పార్టీ నుంచి పూర్తిగా సాగనంపాలని ఆప్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.