expel
-
బ్రిటన్ దౌత్యవేత్తలను బహిష్కరించిన రష్యా
మాస్కో: గూఢచర్యం ఆరోపణలపై ఆరుగురు బ్రిటన్ దౌత్యవేత్తలను రష్యా బహిష్కరించింది. మాస్కోలోని బ్రిటన్ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న ఆరుగురు దౌత్యవేత్తలు రష్యా కీలక సమాచారాన్ని శత్రు దేశాలకు చేరవేస్తున్నట్లు ఆధారాలు దొరికాయని అధికారులు తెలిపారు. దీని వల్ల రష్యా భద్రతకు ముప్పుండడంతో వారిని బహిష్కరించినట్లు వెల్లడించారు. బ్రిటిష్ ఎంబసీలోని ఆరుగురు సభ్యులు గూఢచర్యానికి పాల్పడినట్లుగా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ ఆఫ్ రష్యా ఆధారాలు సమర్పించింది. అయితే లండన్‌కు, మాస్కోకు మధ్య ఉన్న స్నేహం కారణంగా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా బహిష్కరించామని అధికారులు తెలిపారు.గూఢచర్యంలో ఇతర దౌత్యవేత్తల ప్రమేయం ఉందని తెలిస్తే వారిని కూడా బహిష్కరిస్తామని చెప్పారు.అయితే రష్యా చేసిన ఈ ఆరోపణలపై మాస్కోలోని బ్రిటన్ ఎంబసీ స్పందించలేదు. కాగా గూఢచర్యం ఆరోపణలతో రష్యా ఎంబసీలో రక్షణ వ్యవహారాలను పర్యవేక్షించే ఓ అధికారిని బ్రిటన్ ఇటీవల బహిష్కరించింది. ఇందుకు కౌంటర్‌గానే తాజాగా రష్యా బ్రిటన్ దౌత్యవేత్తలను బహిష్కరించి ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి.. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా -
రష్యా బహిష్కరణ? ఆ హక్కు ఎవరికీ లేదు!
యుద్ధ నేరాలకు పాల్పడుతోందన్న ఆరోపణలతో రష్యాను.. జీ-20 గ్రూపు నుంచి బహిష్కరించాలని అమెరికా గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఉక్రెయిన్ యుద్ధంతో ఆర్థిక ఆంక్షల ద్వారా ఇప్పటికే రష్యాను అంతర్జాతీయ సమాజం నుంచి వెలేసినంత పని చేశాయి అమెరికా దాని మిత్రపక్ష పాశ్చాత్య దేశాలు. ఈ తరుణంలో చైనా, తన మిత్ర పక్షం రష్యాకు అనుకూల గళం వినిపించింది. జీ 20 అనేది అందులో ఉన్న సభ్య దేశాలు అంతర్జాతీయ ఆర్థిక సహకారం అందించుకునే వేదిక. అదేం దేశాల మధ్య జరిగే వ్యాపారం కాదు. అందులో రష్యా కీలక సభ్యత్వం ఉన్న దేశం. అలాంటి దేశాన్ని బహిష్కరించే హక్కు ఏ ఒక్క దేశానికి ఉండదు అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇదిలా ఉండగా.. వింటర్ ఒలింపిక్స్టైంలోనే రష్యా-చైనాలు తమ బంధం బలమైందని ప్రకటించుకున్నాయి. అప్పటి నుంచి ఉక్రెయిన్ పరిణామంలో అమెరికా హెచ్చరికలను సైతం పట్టించుకోకుండా చైనా రష్యాకు మద్ధతుగా నిలుస్తోంది. మరోవైపు జీ20 కూటమి నుంచి రష్యాను బహిష్కరించే విషయమై మిత్రపక్షాలతో చర్చించనున్నట్లు వైట్‌హౌజ్ జాతీయ భదత్రా సలహాదారు జేక్ సల్లివాన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జీ 20 దేశాల్లో మొత్తం 19 దేశాలు ఐదు గ్రూపులుగా విడిపోయి ఉన్నాయి(యూరోపియన్ యూనియన్ అదనం). భారత్, రష్యాతో పాటు గ్రూప్-2 లో ఉంది. జీ 20కి పుతిన్! క్రిమియా ఆక్రమణ తర్వాత 2014లో జీ8 దేశాలు పుతిన్‌ను(రష్యా) బహిష్కరించాయి. దీంతో జీ8 కాస్త జీ7గా మారింది. ఈ తరుణంలో జీ20 నుంచి రష్యాకు అలాంటి అనుభవమే పునరావృతం అవుతుందా? అనే కోణంలో చర్చ నడుస్తోంది ఇప్పుడు. అయితే ఈ ఏడాది జీ20 సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని పుతిన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అక్టోబర్ చివర్లో బాలి(ఇండోనేషియా)లో జరగబోయే జీ 20 సదస్సుకు పుతిన్ హాజరవుతారని ఇండోనేషియాలో రష్యా దౌత్యవేత్త ల్యుద్మిలా వోరోబియెవా ప్రకటించారు. చదవండి: చైనాను ఇరుకున పెడుతున్న రష్యా! అమెరికాకు మరింత మంటపుట్టించేలా.. -
14మంది ఎమ్మెల్యేలపై వేటు
గాంధీనగర్: విప్‌ను దిక్కరించిన ఎమ్మెల్యేలపై గుజరాత్ కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. ఏకంగా 14మంది పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి ఆరేళ్లపాటు సస్పెన్సన్ చేసింది. వీరిలో ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన శంకర్ సింగ్ వాఘెలా కూటమికి చెందిన మహేంద్ర వాఘెలా, రాఘవ్జీ పటేల్, అమిత్ చౌదరీ, బోలాబాయ్ గోహిల్, సీకే రౌల్జీ, కామ్సీ మక్వానా, హకుబా జడేజా ఉన్నారు. మంగళవారం గుజరాత్లో రాజ్యసభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పార్టీ అభ్యర్థి అహ్మద్ పటేల్‌కు ఓటువేయాలని విప్ జారీ చేసింది. అయితే, కానీ మొత్తం 14మంది ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయాన్ని దిక్కరించి బీజేపీకి ఓటు వేయడంతో వారిపై తాజాగా సస్పెన్షన్ వేటు వేసినట్లు గుజరాత్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అశోక్ గెహ్లాట్ తెలిపారు. -
శివపాల్ సన్నిహితులపై వేటు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో లుకలుకలు కొనసాగుతున్నాయి. శివపాల్ యాదవ్‌కు సన్నిహితులుగా భావిస్తున్న ఆరుగురిపై వేటు పడింది. మహ్మద్ షాహిద్, దీపక్ మిశ్రా, కల్లు యాదవ్, రాజేశ్ యాదవ్, రాకేశ్ యాదవ్ సహా ఆరుగురిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. 'సమాజ్‌వాదీ సెక్యులర్ మోర్చా' అనే పేరుతో కొత్త పార్టీ పెడుతున్న ములాయం సింగ్ తమ్ముడు, శివపాల్ యాదవ్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన మద్దతుదారులపై వేటు వేయడం గమనార్హం. స్నేహితుల రూపంలో ఉన్న శత్రువులెవరో రాజకీయాల్లో ఉన్న తమకు బాగా తెలుసునని మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించడం విశేషం. తన కొడుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసి తప్పు చేశానని అంతకుముందు ములాయం సింగ్ అన్నారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపి పార్టీని నాశనం చేశాడని ధ్వజమెత్తారు. -
80 వేల మంది వలసదారులు వెనక్కి!
స్వీడన్: సిరియా సంక్షోభం నేపథ్యంలో ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న వలదారులతో యురోపియన్ యూనియన్ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాజాగా స్వీడన్ తమ దేశంలోకి ప్రవేశించిన 80,000 మంది వలసదారులను తిప్పిపంపనున్నట్లు తెలిపింది. 2015లో మొత్తం 1,63,000 మంది ప్రజలు స్వీడన్ ఆశ్రయం కోరారు. అయితే వారిలో సగం మందికి పైగా ఆశ్రయం కల్పించిన స్వీడన్ మిగిలిన వారిని వెనక్కి పంపాలని నిర్ణయించుకుంది. దీనిపై స్వీడన్ అధికారి ఆండ్రస్ విజిమెన్ మాట్లాడుతూ.. వలసదారులలో 60 నుండి 80 వేల మందిని వెనక్కి పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో స్వీడన్ తాత్కాలిక బార్డర్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వలసదారులను నియంత్రించే చర్యలు చేపడుతోంది. యూరప్‌లోకి అక్రమంగా వలసవస్తున్న వారికి జర్మనీతో పాటు ఇటీవల స్వీడన్ గమ్యంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. -
తోమర్ ఇక ఇంటికేనా!
న్యూఢిల్లీ: అవినీతి, అన్యాయం, మోసం,లంచం వంటి అంశాలపై సమరశంఖం పూరించి ప్రత్యేక పార్టీని నెలకొల్పి విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్.. తన ప్రభుత్వం విషయంలో కూడా అంతే నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. తన పార్టీకి కలంకం తీసుకొచ్చిన న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, అరెస్టు వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మోసం చేసిన తోమర్ ను ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ మేరకు కసరత్తు పూర్తి చేసినట్లు కూడా సమాచారం. శుక్రవారం దీనిపై నిర్ణయం కూడా తీసుకోనున్నట్లు కీలక సమాచారం. బీహార్‌లోని తిలక్ మాంఝీ భాగల్పూర్ యూనివర్సిటీలో తాను చదివినట్లు మంత్రి తోమర్ సర్టిఫికెట్ చూపించగా.. అది నకిలీదని పేర్కొంటూ సదరు యూనివర్సిటీ తన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. న్యాయశాఖ మంత్రి తోమర్ విద్యార్హత సర్టిఫికెట్లన్నీ నకిలీవేనని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఆ తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పోలీసులు తోమర్ ను అరెస్టు చేయడంతో కేజ్రీవాల్ సర్కార్ విమర్శల పాలయింది. కేజ్రీవాల్ కు ఈ అంశ తల నొప్పిగా మారింది. ఇక వేరే దారి లేక తోమర్ ను పార్టీ నుంచి పూర్తిగా సాగనంపాలని ఆప్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
సగం మంది రెబెల్స్‌పైనే టీడీపీ వేటు
సాక్షి, హైదరాబాద్: తిరుగుబాటు అభ్యర్థులపై చర్య తీసుకునే విషయంలో తెలుగుదేశం పార్టీ తన మార్కు హైడ్రామా నడిపింది. రెబెల్స్‌పై వేటు వేసే విషయంలో కూడా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు నాల్కల ధోరణిని పాటించారు. సీమాంధ్రలో 16 నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు రెబెల్స్‌గా బరిలో దిగగా సగం మందిపై మాత్రమే సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీని ధిక్కరించి బరిలో నిలిచిన 8 మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆ పార్టీ శనివారం ప్రకటించింది. మిగిలిన 8 చోట్ల పోటీలో ఉన్న రెబెల్స్ విషయంలో మాత్రం మౌన ముద్రదాల్చింది. అలాగే బీజేపీకి కేటాయించిన స్థానాల్లో మూడు చోట్ల చంద్రబాబు అధికారికంగా బీ ఫారాలిచ్చి మరీ అభ్యర్థులను నిలిపారు. తాజాగా పార్టీ నుంచి సస్పెండు చేసిన జాబితాలో బీజేపీకి కేటాయించిన చోట తిరుగుబాటు అభ్యర్థులుగా ఉన్న ఇద్దరిని మాత్రమే సస్పెండ్ చేసి మరో అభ్యర్థిని ప్రచారం చేసుకోవాలని చెప్పింది. పొత్తులో భాగంగా బీజేపీకి 13 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించినప్పటికీ.. పొత్తు ధర్మాన్ని తుంగలో తొక్కి బీజేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా మూడు చోట్ల చంద్రబాబు అధికారికంగా అభ్యర్థులను నిలిపారు. దాంతో బీజేపీ నుంచి తీవ్రస్థాయి విమర్శలు వెల్లువెత్తాయి. తమకు కేటాయించిన చోట టీడీపీ అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని బీజేపీ కోరినప్పటికీ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు చంద్రబాబు పట్టించుకోలేదు. తీరా నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన మూడు రోజులకు అదీ ముగ్గురిపైన కాకుండా ఇద్దరిని మాత్రమే తూతూ మంత్రంగా సస్పెండ్ చే యడం పట్ల ఇపుడు బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. శనివారం నిమ్మక జయరాజ్ (కురుపాం), కుంభా రవిబాబు (అరకు లోయ), సకూరు అనిత (భీమిలి), ఎన్వీఎస్ఎస్ వర్మ (పిఠాపురం), కొట్టు సత్యనారాయణ (తాడేపల్లిగూడెం), టీవీ రామారావు (కొవ్వూరు), ఆర్. జితేంద్రగౌడ్ (గుంతకల్లు), సుధా దుర్గాప్రసాద్ (కడప)లను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు టీడీపీ ప్రకటించింది. ఇందులో గుంతకల్లు, కడప, సంతనూతలపాడు స్థానాలు పొత్తులో భాగంగా బీజేపీకి వదిలినవి కాగా, గుంతకల్లు, కడపల్లో పోటీల్లో ఉన్న ఆర్. జితేంద్రగౌడ్, సుధా దుర్గాప్రసాద్‌లను సస్పెండ్ చేసినా సంతనూతలపాడు నుంచి పోటీలో ఉన్న బీఎన్ విజయకుమార్ జోలికి మాత్రం పోలేదు. అలాగే డాక్టర్ సత్యనారాయణమూర్తి (బాబ్జీ)(పాలకొల్లు), బల్లి దుర్గా ప్రసాదరావు (గూడూరు), అల్తాఫ్ బాషా (పుంగనూరు), కురుపాటి రాజా నరేంద్ర(రాప్తాడు), రాయల సుమలత(చింతలపూడి), చెంచు మాల్యాద్రి (విజయవాడ పశ్చిమ), కెంబూరు రామ్మోహన్రావు (చీపురుపల్లి) తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో ఉన్నప్పటికీ వారిపై టీడీపీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
బహిష్కృత వేటుపై ఎంపీల స్పందన
యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఆరుగురి ఎంపీలపై కాంగ్రెస్ పార్టీ వేటు వేయడంపై సీమాంధ్ర ఎంపీలు స్పందించారు. 'కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని కలలో కూడా అనుకోలేదు. 30 ఏళ్లపాటు సేవచేసిన నన్ను బహిష్కరించడం బాధాకరం. రాష్ట్ర కాంగ్రెస్‌ను సర్వనాశనం చేస్తున్నారు. వారి నిరంకుశ వైఖరికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి గడ్డు పరిస్థితి ఎదురవ్వడం ఖాయం' - ఎంపీ సాయిప్రతాప్ 'మా బహిష్కరణకు సంబంధించి నోటీసులందిన తర్వాత స్పందిస్తాం. అందరినీ కలుపుకుని పార్లమెంట్లో మరింత సమర్థవంతంగా సమైక్యవాణి వినిపిస్తాం' - ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. అన్నింటికి సిద్దపడే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. అవిశ్వాస తీర్మానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాదు, పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాత్రమే - రాయపాటి సాంబశివరావు అన్నింటికి సిద్దపడే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి పోరాటం చేస్తున్నాం. సస్పెన్షన్ వేటు పడినా తమ పోరాటంలో ఎలాంటి సడలింపు ఉండదు. అప్రజాస్వామిక పద్దతిలో విభజన బిల్లును పార్లమెంట్ లో ఎలా ప్రవేశపెడుతారు - లగడపాటి తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించిందని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. విభజన బిల్లును అడ్డుకోవడం, వ్యతిరేకించి ఓటు వేసే అవకాశం కల్పించి కాంగ్రెస్ తమకు మేలు చేసిందని వ్యాఖ్యానించారు. ఇక తమను అడ్డుకునేవారు ఉండరని అన్నారు. తమను పార్టీ నుంచి బహిష్కరించగలరు కానీ పార్లమెంట్ తప్పించలేరు. - సబ్బం హరి ఎప్పుడో అవిశ్వాస తీర్మానం నోటిస్ ఇచ్చాం. ఇప్పడు వేటు వేశారు. ఈ వ్యవహారం దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుంది. చిదంబరం, జై రాంరమేశ్ లు సోనియాను తప్పుదారి పట్టిస్తున్నారు. సోనియా తప్పుడు సలహాలు ఇస్తున్న చిదంబరం, జై రాం రమేశ్ లు రాజీనామా చేయాలి. - హర్ష కుమార్ 'మా సహచర ఎంపీలను బహిష్కరించడం బాధాకరం. విభజనకు వ్యతిరేకంగా ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారు. మేమంతా సమైక్యవాదులం' - అనంత వెంకట్రామిరెడ్డి -
బహిష్కరణ వేటును సమర్థించుకున్న కాంగ్రెస్
యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలపై బహిష్కరణ వేటు విధించడాన్ని ఆపార్టీ సమర్ధించుకుంది. కాంగ్రెస్ పార్టీ విధానాలను వ్యతిరేకించిన వారిపై చర్య తీసుకున్నామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ అన్నారు. పార్టీ వ్యతిరేకంగా మాట్లాడే వారిపై, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడిన వారెవరైనా సరే వేటు తప్పదని మాకెన్ అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా.. వ్యతిరేకించినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం అని మాకెన్ తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న ఆరుగురు ఎంపీలపై మంగళవారం కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు వేసిన సంగతి తెలిసిందే.