సాక్షి, హైదరాబాద్: తిరుగుబాటు అభ్యర్థులపై చర్య తీసుకునే విషయంలో తెలుగుదేశం పార్టీ తన మార్కు హైడ్రామా నడిపింది. రెబెల్స్‌పై వేటు వేసే విషయంలో కూడా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు నాల్కల ధోరణిని పాటించారు. సీమాంధ్రలో 16 నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు రెబెల్స్‌గా బరిలో దిగగా సగం మందిపై మాత్రమే సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీని ధిక్కరించి బరిలో నిలిచిన 8 మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆ పార్టీ శనివారం ప్రకటించింది. మిగిలిన 8 చోట్ల పోటీలో ఉన్న రెబెల్స్ విషయంలో మాత్రం మౌన ముద్రదాల్చింది. అలాగే బీజేపీకి కేటాయించిన స్థానాల్లో మూడు చోట్ల చంద్రబాబు అధికారికంగా బీ ఫారాలిచ్చి మరీ అభ్యర్థులను నిలిపారు. తాజాగా పార్టీ నుంచి సస్పెండు చేసిన జాబితాలో బీజేపీకి కేటాయించిన చోట తిరుగుబాటు అభ్యర్థులుగా ఉన్న ఇద్దరిని మాత్రమే సస్పెండ్ చేసి మరో అభ్యర్థిని ప్రచారం చేసుకోవాలని చెప్పింది. పొత్తులో భాగంగా బీజేపీకి 13 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించినప్పటికీ.. పొత్తు ధర్మాన్ని తుంగలో తొక్కి బీజేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా మూడు చోట్ల చంద్రబాబు అధికారికంగా అభ్యర్థులను నిలిపారు. దాంతో బీజేపీ నుంచి తీవ్రస్థాయి విమర్శలు వెల్లువెత్తాయి. తమకు కేటాయించిన చోట టీడీపీ అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని బీజేపీ కోరినప్పటికీ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు చంద్రబాబు పట్టించుకోలేదు. తీరా నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన మూడు రోజులకు అదీ ముగ్గురిపైన కాకుండా ఇద్దరిని మాత్రమే తూతూ మంత్రంగా సస్పెండ్ చే యడం పట్ల ఇపుడు బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. శనివారం నిమ్మక జయరాజ్ (కురుపాం), కుంభా రవిబాబు (అరకు లోయ), సకూరు అనిత (భీమిలి), ఎన్‌వీఎస్‌ఎస్ వర్మ (పిఠాపురం), కొట్టు సత్యనారాయణ (తాడేపల్లిగూడెం), టీవీ రామారావు (కొవ్వూరు), ఆర్. జితేంద్రగౌడ్ (గుంతకల్లు), సుధా దుర్గాప్రసాద్ (కడప)లను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు టీడీపీ ప్రకటించింది. ఇందులో గుంతకల్లు, కడప, సంతనూతలపాడు స్థానాలు పొత్తులో భాగంగా బీజేపీకి వదిలినవి కాగా, గుంతకల్లు, కడపల్లో పోటీల్లో ఉన్న ఆర్. జితేంద్రగౌడ్, సుధా దుర్గాప్రసాద్‌లను సస్పెండ్ చేసినా సంతనూతలపాడు నుంచి పోటీలో ఉన్న బీఎన్ విజయకుమార్ జోలికి మాత్రం పోలేదు. అలాగే డాక్టర్ సత్యనారాయణమూర్తి (బాబ్జీ)(పాలకొల్లు), బల్లి దుర్గా ప్రసాదరావు (గూడూరు), అల్తాఫ్ బాషా (పుంగనూరు), కురుపాటి రాజా నరేంద్ర(రాప్తాడు), రాయల సుమలత(చింతలపూడి), చెంచు మాల్యాద్రి (విజయవాడ పశ్చిమ), కెంబూరు రామ్మోహన్‌రావు (చీపురుపల్లి) తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో ఉన్నప్పటికీ వారిపై టీడీపీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
సగం మంది రెబెల్స్‌పైనే టీడీపీ వేటు
Published Sun, Apr 27 2014 1:55 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM
Advertisement
Advertisement