
80 వేల మంది వలసదారులు వెనక్కి!
స్వీడన్: సిరియా సంక్షోభం నేపథ్యంలో ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న వలదారులతో యురోపియన్ యూనియన్ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాజాగా స్వీడన్ తమ దేశంలోకి ప్రవేశించిన 80,000 మంది వలసదారులను తిప్పిపంపనున్నట్లు తెలిపింది.
2015లో మొత్తం 1,63,000 మంది ప్రజలు స్వీడన్ ఆశ్రయం కోరారు. అయితే వారిలో సగం మందికి పైగా ఆశ్రయం కల్పించిన స్వీడన్ మిగిలిన వారిని వెనక్కి పంపాలని నిర్ణయించుకుంది. దీనిపై స్వీడన్ అధికారి ఆండ్రస్ విజిమెన్ మాట్లాడుతూ.. వలసదారులలో 60 నుండి 80 వేల మందిని వెనక్కి పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో స్వీడన్ తాత్కాలిక బార్డర్ చెక్పోస్టులను ఏర్పాటు చేసి వలసదారులను నియంత్రించే చర్యలు చేపడుతోంది. యూరప్లోకి అక్రమంగా వలసవస్తున్న వారికి జర్మనీతో పాటు ఇటీవల స్వీడన్ గమ్యంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.