జిమ్మిబాబు అరెస్టుకు రంగం సిద్ధం!
* ఏపీలో తలదాచుకున్నట్లు గుర్తించిన ఏసీబీ
* ముమ్మరం కానున్న ‘ఓటుకు కోట్లు’ దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో దర్యాప్తు తిరిగి ఊపందుకోనుంది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఏసీబీ.. సాంకేతిక అడ్డంకులు తొలగిపోవడం, కీలకమైన సమాచారం లభించడంతో దర్యాప్తును వేగవంతం చేయనుంది. గత నెల 4న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు నోటీసులు జారీ చేసినా.. తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబు ఇప్పటివరకు ఏసీబీ విచారణకు హాజరుకాలేదు. ఈ కేసులో జిమ్మిబాబు పాత్ర కీలకం కావడంతో ఆయనను పట్టుకోవడానికి ఏసీబీ ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది.
జిమ్మిబాబు ఏపీలోని తన సమీప బంధువుల ఇళ్లలో ఆశ్రయం పొందినట్లు గుర్తించింది. సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ (నిందితుడిగా అనుమానిస్తూ) నోటీసులు జారీ చేసినందున నేరుగా అదుపులోకి తీసుకోవాలని యోచిస్తోంది. త్వరలో ఆయనను అరెస్టు చేసి కేసులోని ‘ఆర్థిక మూలాల’పై ప్రశ్నించే అవకాశం ఉంది.
తొలగిన సాంకేతిక సమస్యలు: ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నివేదిక కీలకంగా మారింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు తెలుగుదేశం పార్టీ నేత రేవంత్‌రెడ్డి డబ్బులిస్తుండగా చిత్రీకరించిన దృశ్యాలతో పాటు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో ఉన్న కాల్ రికార్డులు, డేటా ఆధారంగానే ఈ కేసు దర్యాప్తు సాగుతోంది. ముఖ్యంగా రెండో నిందితుడు సెబాస్టియన్‌కు చెందిన రెండు ఫోన్లలో కీలక సమాచారం ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.
అందులో ఒక ఫోన్‌లో రికార్డయిన సెబాస్టియన్, సండ్రల సంభాషణలను న్యాయస్థానానికి అందజేసింది. మరోఫోన్‌లో డిలీట్ చేసిన ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్ రికార్డులను ప్రత్యేక సాఫ్ట్‌వేర్ తెప్పించి రికవరీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా రహస్య కెమెరాల ద్వారా చిత్రీకరించిన దృశ్యాలను, వారి ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లలోని సమాచారాన్ని సైతం ఎఫ్‌ఎస్‌ఎల్ పూర్తిగా అధ్యయనం చేసింది. అయితే ఎఫ్‌ఎస్‌ఎల్ నుంచి సమాచారాన్ని నేరుగా తీసుకునే వీలు లేనందున న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని.. దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని ఏసీబీ అధికారులు యోచిస్తున్నారు.