హలో.. మేం ఏసీబీ నుంచి.. | - | Sakshi
Sakshi News home page

హలో.. మేం ఏసీబీ నుంచి..

Published Mon, Nov 6 2023 12:16 AM | Last Updated on Mon, Nov 6 2023 11:19 AM

- - Sakshi

ఏది ఏమైనప్పటికీ ఈ తరహా మోసాలపై ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. ఏసీబీ అధికారులు ఫోన్‌ చేసి నగదు డిమాండ్‌ చేయరన్న విషయాన్ని ఉద్యోగులు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డబ్బు కోసం బెదిరింపు చర్యలకు పాల్పడితే వారు నకిలీ అధికారులని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటారు.

నెల్లూరు(క్రైమ్‌): అడ్డదారిలో డబ్బు సంపాదించాలని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గ్యాంగ్‌ సినిమా తరహాలో ఏసీబీ అధికారులుగా అవతారమెత్తారు. ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచి రిజిస్ట్రేషన్స్‌, ఎకై ్సజ్‌, రెవెన్యూ, పోలీసు, ఆర్టీఓ, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌, కమర్షియల్‌ ట్యాక్స్‌ తదితర విభాగాలకు చెందిన అధికారుల ఫోన్‌నంబర్లు సేకరించి మోసాలకు తెరలేపారు. తాను ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ని, హెడ్‌ ఆఫీసు నుంచి ఫోన్‌ చేస్తున్నామంటూ ప్రభుత్వ ఉద్యోగికి ఫోన్‌ చేసి మాటలు కలుపుతారు. మీపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారు. సెటిల్‌ చేసుకుంటే ఓకే.. లేదంటే రైడ్‌ జరుగుతుందని భయపెడతారు. కావాలంటే తమ డీఎస్పీతో మాట్లాడాలంటూ బెదిరిస్తారు. బెదిరిపోయే ఉద్యోగుల నుంచి గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా రూ.లక్షల్లో నగదు వసూలు చేస్తున్నారు. ఈ తరహా నేరాలు తరచూ జరుగుతున్నా బాధిత అధికారులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడం వెనుక వివిధ కారణాలున్నాయి. దీనిని అలుసుగా తీసుకున్న సదరు నకిలీలు పెద్ద సంఖ్యలో అధికారులను బెదిరించి మరీ నగదు వసూళ్లకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారు.

గతంలోనూ ఇదే తరహా నేరాలు
గతేడాది డిసెంబర్‌లో పోలీసుశాఖలో ఏఎస్సైగా పనిచేస్తూ నగరంలో నివాసం ఉంటున్న ఓ అధికారికి నకిలీ ఏసీబీ అధికారి ఫోన్‌ చేశాడు. మీరు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఫిర్యాదులు అందాయని, రైడ్‌ చేయకుండా ఉండాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో బెదిరిపోయిన సదరు ఏఎస్సై వెంటనే సదరు నకిలీ అధికారికి అడిగినంత ముట్టజెప్పారు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబసభ్యులు అప్పట్లో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదే తరహాలో గుర్తుతెలియని వ్యక్తి తాను ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌నంటూ గత నెల 31వ తేదీన నగరంలోని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఈఓ వెంకటశ్రీనివాసులురెడ్డికి ఫోన్‌ చేశాడు. మీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, రూ.1.50 లక్షలు ఇవ్వాలని, లేదంటే రైడ్‌ చేస్తామని బెదిరింపు చర్యలకు పాల్పడ్డాడు. దీంతో ఈఓ ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తనకు కాల్‌ చేసిన వ్యక్తి ఫోన్‌నంబర్‌ ఏసీబీలో పనిచేస్తున్న వ్యక్తిదా.. కాదా.. అని ఆరా తీశారు. ఆ నంబర్‌ తమది కాదని ఏసీబీ అధికారులు స్పష్టంగా వెల్లడించడంతో ఈ ఘటనపై బాధితుడు ఈ నెల 2వ తేదీ రాత్రి దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్‌నంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

ఆ గ్యాంగ్‌ పనేనా..?
రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా నేరాల్లో దిట్ట అనంతపురం జిల్లాకు చెందిన మోస్ట్‌వాంటెడ్‌ జయకృష్ణ గ్యాంగ్‌. జయకృష్ణ, అతని స్నేహితులు గ్యాంగ్‌ సినిమాతో ప్రభావితమై అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు నకిలీ ఏసీబీ అధికారుల అవతారమెత్తారు. దొడ్డిదారిన ప్రీపెయిడ్‌ సిమ్‌కార్డులు సంపాదించి, వాటిని వినియోగించి మోసాలకు పాల్పడుతున్నారు.

2019 నుంచి రాష్ట్రంలోని కర్నూలు, పులివెందుల, అనంతపురం, మచిలీపట్నం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలోనూ వివిధ శాఖల అధికారులకు ఫోన్‌ చేసి ఏసీబీ అధికారులమంటూ బెదిరించి నగదు వసూళ్లకు పాల్పడ్డారు. పలుమార్లు అరెస్ట్‌ అయి జైలుకు సైతం వెళ్లారు. అయినా వారి తీరులో మార్పు రాకపోగా.. తిరిగి యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. నిందితులు నకిలీ సిమ్‌కార్డులతో అధికారులకు ఫోన్‌లు చేస్తూ లొకేషన్‌ తెలియకుండా జాగ్రత్తలు పడుతున్నారు. తాజా ఘటన సైతం సదరు గ్యాంగ్‌ పనై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

జిల్లాలో కొన్ని ఘటనలు
ఏసీబీ అధికారినంటూ 2020లో ఆర్టీఓ కార్యాలయంలో పనిచేసిన ఓ ఉద్యోగికి ఫోన్‌కాల్‌ వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నావని ఫిర్యాదులు అందాయని, తాను అడిగినంత డబ్బు ఇస్తే రైడ్‌లు ఉండవని చెప్పడంతో బెంబేలెత్తిన సదరు ఉద్యోగి రూ.లక్షల్లో ముట్టజెప్పాడు.

రిజిస్ట్రేషన్‌ శాఖలో గతంలో ఓ ఉద్యోగికి సైతం ఇదే తరహాలో ఫోన్‌కాల్‌ వచ్చింది. ఏసీబీ హెడ్‌ ఆఫీస్‌ నుంచి కాల్‌ చేస్తున్నామని, మీపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఫిర్యాదులు అందాయని, కేసు నమోదు చేయకుండా ఉండాలంటే నగదు ఇవ్వాలని బెదిరించి రూ.లక్షలు కాజేశారు.

తాజాగా నగరంలోని ఓ దేవస్థానం ఈఓకు ఫోన్‌కాల్‌ వచ్చింది. మీపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. సెటిల్‌ చేసుకుంటే సరే.. లేదంటే రైడ్‌ జరుగుతుందని బెదిరించారు. రూ.1.50 లక్షలు డిమాండ్‌ చేయడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫోన్‌లో సంభాషణ ఇలా..

నకిలీ ఏసీబీ అధికారి : హలో ఏసీబీ హెడ్‌ ఆఫీస్‌ నుంచి మాట్లాడుతున్నాం.

ఉద్యోగి : నమస్తే సార్‌ చెప్పండి

నకిలీ ఏసీబీ అధికారి : మీపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇప్పటికే మా సిబ్బంది మీకు సంబంధించి చాలా సమాచారం సేకరించారు. మీరు మంచి వ్యక్తి అని పలువురు చెప్పారు. మీపై కేసు పెట్టాలా.. వద్దా.. అనే ఆలోచనలో ఉన్నాం.

ఉద్యోగి : సార్‌ నేను చాలా మంచి వాడిని. ఎవరో గిట్టని వాళ్లు నాపై ఫిర్యాదులు చేశారు.

నకిలీ ఏసీబీ అధికారి : కానీ మా ఎంకై ్వరీ రిపోర్టు అలా లేదు కదా? మనం ఒక ఒప్పందానికి వస్తే కేసులు. రైడ్‌లు లేకుండా చూస్తాను. ఏమంటారు?

ఉద్యోగి : ఓకే సార్‌ మీరు అడిగినంత ఇస్తాను. ఇంతటితో ఆ విషయాన్ని పక్కన పెట్టేయండి.

ఇలా నకిలీ ఏసీబీ అధికారులు ఆర్టీఓ, రిజిస్ట్రేషన్స్‌, రెవెన్యూ, పోలీసు తదితర శాఖల ఉద్యోగులను బెదిరించి రూ.లక్షలు దోచేస్తున్నారు. అయితే ఈ మోసాలపై ఫిర్యాదులు చేసేందుకు బాధితుల్లో ఒకరిద్దరు మినహా ముందుకు రాకపోవడం వెనుక పరువుపోతుందన్న భయమే కారణంగా తెలుస్తోంది. ఇది మోసగాళ్లకు కలిసి వస్తోంది. దీంతో వారు యథేచ్ఛగా నేరాలకు పాల్పడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement