నెల్లూరు(క్రైమ్): దంపతుల నడుమ విభేదాలో.. మరే ఇతర కారణమో స్పష్టంగా తెలియదు కానీ ఓ తల్లి తన మూడేళ్ల కుమార్తెకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన నగరంలోని నేతాజీనగర్ ఎనిమిదో వీధిలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. వెంకటాచలం మండలం కురిచెర్లపాడుకు చెందిన ఎం.గోవర్ధన్, ప్రగతినగర్(సారాయంగడి సెంటర్)కు చెందిన వాణి(28) డిగ్రీ చదువుకునే సమయంలో ప్రేమలో పడ్డారు. ఇద్దరి కులాలు వేరుకావడంతో గోవర్ధన్ తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించలేదు. వాణి తల్లిదండ్రులు సముఖం వ్యక్తం చేశారు. దీంతో 2018లో గోవర్ధన్ – వాణి వివాహం చేసుకున్నారు. గోవర్ధన్ రామలింగాపురం సమీపంలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో లోన్ సెక్షన్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
వారికి కుమార్తె హరిమోక్తిక(3) ఉంది. సుమారు రెండు నెలలుగా వారు నేతాజీనగర్ ఎనిమిదో వీధిలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఎప్పటిలాగే ఉదయం 9.30 గంటలకు గోవర్ధన్ ఉద్యోగానికి వెళ్లారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో అతని మామ సుధాకర్(వాణి తండ్రి) ఫోన్ చేసి వాణి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చెప్పారు. గోవర్ధన్ భార్యకు ఫోన్ చేసినా ఫలితం లేకుండాపోయింది. దీంతో వాణి తల్లిదండ్రులు, గోవర్ధన్ హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తెరిచే ప్రయత్నం చేయగా లోపలి నుంచి గడియపెట్టి ఉండడంతో గట్టిగా తోయగా తలుపు తెరుచుకుంది. లోనికి వెళ్లి చూడగా వాణి ఫ్యానుకు చీరతో ఉరేసుకుని ఉండ గా, చిన్నారి బెడ్‌పై మృతిచెంది ఉంది.
ఈ ఘటనపై కుటుంబసభ్యులు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్ పీవీ నారాయణ, ఎస్సై అంకమ్మ, ట్రెయినీ డీఎస్పీ హేమలత ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వాణి ఆత్మహత్యకు గల కారణాలపై భర్తను విచారించగా తాము ఎంతో అన్యోన్యంగా ఉండేవారమని చెప్పాడు. చుట్టుపక్కల వారిని విచారించినా వారు అదే విషయాన్ని తెలియజేశారు. చిన్నారి మృతదేహం పక్కన పాలగిన్నె ఉండడం అందులో ఏదో కలిపినట్లు ఉండడంతో వాణి తొలు త చిన్నారిని చంపి ఆపై ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అన్యోన్యంగా ఉంటే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమై ఉంటుందని పోలీసులు ఆరా తీస్తున్నారు.
తల్లి, కుమార్తెల మృతి విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను చూసి చలించిపోయారు. గోవర్ధన్ వల్లనే తమ కుమార్తె చనిపోయిందని మృతురాలి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్యోగం పేరిట రోజుల తరబడి ఇంటికి వచ్చేవాడు కాదని, ఇంట్లో డబ్బులు సైతం ఇచ్చేవాడు కాదని, వాణి బంగారు నగలు అన్నీ కుదువపెట్టాడని వారు ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారించి తగిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. మృతదేహాలను జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment