యూజర్ చెబితేనే ఫోన్‌లో నెట్ యాక్టివేషన్
న్యూఢిల్లీ : డేటా సేవలకు టెల్కోలు అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పందించింది. యూజర్ల నుంచి స్పష్టమైన అంగీకారం పొందిన తర్వాతే టెల్కోలు వారి మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్‌ను యాక్టివేట్ చేయాలని ప్రతిపాదించింది.
అలాగే వాడకం పరిమితులు నిర్దిష్ట స్థాయిలకు దగ్గరపడగానే ఎస్‌ఎంఎస్/టోల్ ఫ్రీ కోడ్ ద్వారా యూజర్లకు సమాచారాన్ని తెలియజేయాలి. ఇంటర్నేషనల్ రోమింగ్‌లో ఉన్న యూజర్లు డేటా సర్వీసులు వాడదల్చుకోని పక్షంలో వాటిని డీయాక్టివేట్ చేసుకునేలా కూడా అలర్ట్‌లు పంపాలని తెలిపింది. డేటా సేవలపై రూపొందించిన ముసాయిదా నిబంధనలను ట్రాయ్ బుధవారం విడుదల చేసింది.
వీటిపై సంబంధిత వర్గాలు మే 12 లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. యూజర్ అనుమతుల మేరకు డేటా సర్వీసుల ను యాక్టివేట్/డీయాక్టివేట్ చేయాలన్నా టోల్ ఫ్రీ కోడ్ 1925(యూఎస్‌ఎస్‌డీ)ని ఉపయోగించవచ్చని ట్రాయ్ పేర్కొంది.