
'చంద్రబాబు బాగోతం దేశమంతా తెలియాలి'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు అంశంపై పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పి.మిథున్రెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చకు అన్ని పార్టీల మద్దతు కోరతామని తెలిపారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సాక్షిగా దొరికినా ఎందుకు చర్యలు తీసుకోలేదో పార్లమెంట్లో ప్రశ్నిస్తామన్నారు.
పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తాము వ్యతిరేకమని వైవీ సుబ్బారెడ్డి, మిథున్రెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ ప్రయోజనాలు దెబ్బతినే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్వవహరిస్తుందని వారు ఆరోపించారు. చంద్రబాబు బాగోతం దేశమంతా తెలియాలని ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్రెడ్డి తెలిపారు. పార్లమెంట్ వర్షకాల సమావేశాలు జులై 21 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ నేపథ్యంలో శనివారం లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆ పార్టీ ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంట్ లో చర్చించవలసిన అంశాలపై ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్ధేశం చేశారు. ఆ భేటీ అనంతరం ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి విలేకర్లతో మాట్లాడారు.