
ఎల్‌కే అద్వానీ
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ హత్యతో ఆరెస్సెస్‌కు సంబంధం లేదని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ బుధవారం తన బ్లాగులో పేర్కొన్నారు. గాంధీ హత్య ఆరెస్సెస్ పనేనని ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. గాంధీ మనవడు రాజ్‌మోహన్ గాంధీ దేశ తొలి హోం మంత్రి వల్లభాయ్ పటేల్‌పై రాసిన పుస్తకాన్ని అద్వానీ ఉటంకించారు. గాంధీ హత్యకు సంబంధించి ఆరెస్సెస్‌పై కాంగ్రెస్ బురదజల్లుడు ప్రచారాన్ని ఈ పుస్తకం సమర్థంగా అడ్డుకుందని వ్యాఖ్యానించారు. రాజ్‌మోహన్ పుస్తకంలో పేర్కొన్న పటేల్ లేఖను అద్వానీ ప్రస్తావించారు.
1948 ఫిబ్రవరి 27న నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు రాసిన ఆ లేఖలోని వివరాలు.. ‘బాపూ హత్య కేసు దర్యాప్తు పురోగతిని రోజూ తెలుసుకుంటున్నాను. నిందితులందరూ సుదీర్ఘ, సవివర వాంగ్మూలాలు ఇచ్చారు. హత్య వెను ఆరెస్సెస్ ప్రమేయం లేదని వీటితో స్పష్టంగా తేలింది.’ కాగా, ప్రధాని అభ్యర్థి ఎంపికపై గాంధీ సరైన నిర్ణయం తీసుకోలేదని రాజ్‌మోహన్ అన్నారని, గాంధీ తొలి ప్రధానిగా నెహ్రూను కాకుండా పటేల్‌ను ఎంచుకుని ఉంటే స్వతంత్ర భారత తొలినాళ్ల చరిత్ర మరోలా ఉండేదని అద్వానీ వ్యాఖ్యానించారు. దేశానికి పటేల్ చేసిన సేవలకు తగిన గుర్తింపు లభించలేదని పేర్కొన్నారు.