పీపీఎఫ్ వడ్డీరేట్లకూ ప్రభుత్వం షాక్?
పీపీఎఫ్ వడ్డీరేట్లకూ ప్రభుత్వం షాక్?
Published Fri, Dec 23 2016 11:31 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM
న్యూఢిల్లీ : గత ఎనిమిదేళ్లలో మొదటిసారి ఈపీఎఫ్ వడ్డీరేటు తగ్గిస్తున్నట్టు ప్రకటించిన కేంద్రప్రభుత్వం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) వడ్డీరేట్లను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. పీపీఎఫ్, చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టే వారు మరో రేటు కోతకు సిద్ధంగా ఉండాలని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం ఒకవేళ గోపినాథ్ ప్యానెల్ ఫార్ములా అమలుచేస్తే ప్రభుత్వ బాండ్ల ఆదాయాలతో సంబంధమున్న చిన్న పొదుపు మొత్తాల వడ్డీరేట్లకు భారీగా కోత పడనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీపీఎఫ్ రేట్ దాదాపు 100 బేసిస్ పాయింట్లు తగ్గి 7 శాతానికి దిగొస్తుందని సమాచారం. గోపినాథ్ ప్యానెల్ ఫార్ములా ప్రకారం కనీస ప్రభుత్వ బాండ్ల ఆదాయాలు కంటే చిన్న పొదుపు మొత్తాల వడ్డీరేట్లే ఎక్కువగా ఉన్నాయి. పీపీఎఫ్నే తీసుకుంటే సగటు 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ ఆదాయం కంటే పీపీఎఫ్ వడ్డీరేటు 25 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉంది.
10 ఏళ్ల పరిమితులోని ప్రభుత్వ బాండ్లపై వచ్చే వడ్డీరేట్లు 6.5 శాతానికి దిగిరావడంతో, జనవరి-మార్చి త్రైమాసికంలో పీపీఎఫ్ రేటు కూడా 7 శాతానికి పడిపోతుందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. అయితే గోపినాథ్ ప్యానెల్ ఫార్ములాను రద్దు చేసి కేవలం పీపీఎఫ్ రేట్లను 20-25 బేసిస్ పాయింట్లు మాత్రమే ప్రభుత్వం తగ్గించే అవకాశాలున్నాయని ఇన్వెస్ట్మెంట్, ట్యాక్స్ ఎక్స్పర్ట్ బల్వంత్ జైన్ చెబుతున్నారు. ఏ మేరకు తీసుకున్నా పీపీఎఫ్ రేటు కిందకి రావడం ఖాయమని తెలుస్తోంది. ఆ రేటు తగ్గించినా.. బ్యాంకు డిపాజిట్లు, కార్పొరేట్ ఎఫ్డీలపై ఆర్జించే ఆదాయాల కంటే పీపీఎఫ్పైనే పొందే వడ్డీ రేటే ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ట్యాక్స్-ఫ్రీ పీపీఎఫ్ పెట్టుబడిదారులకు ఉత్తమమైన పొదుపు మార్గమమని విశ్లేషకులు చెప్పారు.
Advertisement
Advertisement