
కామాంధుల పైశాచిక వీడియోలపై ‘ప్రజ్వల’ లేఖ..
సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం జరపడమే కాకుండా.. ఆ దృశ్యాలతో కూడిన వీడియోలను కామాంధులు వాట్సాప్‌లో పోస్టు చే సిన ఉదంతంపై ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను సుప్రీంకోర్టు శుక్రవారం సూమోటోగా విచారణకు స్వీకరించింది. పాశవికంగా అత్యాచారం చేస్తున్న దృశ్యాలతో కూడిన ఈ వీడియోలు కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఈ ఘటనలపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడంతో పాటు వాట్సాప్ రేప్ వీడియోలున్న పెన్‌డ్రైవ్, డీవీడీలను సమర్పించడంతో ధర్మాసనం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది.
ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. దీనిపై వివరణనివ్వాలంటూ కేంద్రం, యూపీ, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఢిల్లీ, తెలంగాణ కు నోటీసులు జారీ చేసింది. సీజేఐ హెచ్‌ఎల్ దత్తుకు ప్రజ్వల ఎన్‌జీవో చీఫ్ సునీతా కృష్ణన్ రాసిన లేఖను పరిశీలించిన మీదట.. న్యాయమూర్తులు మదన్ బీ లోకూర్, యూయూ లలిత్‌లతో కూడిన సామాజిక న్యాయ ధర్మాసనం సీబీఐచే పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించి సమగ్ర పిటిషన్‌ను మార్చి 9న దాఖలు చేయాలని ఎన్‌జీవోను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 13కు వాయిదా వేసింది.
వీడియోల్లోని వ్యక్తులు బెంగాలీ యాసలో మాట్లాడటం, ఇతర వివరాలను బట్టి.. యూపీ, బెంగాల్, ఢిల్లీ, ఒడిశాలకు నోటీసులు జారీచేసింది. అయితే, ఇంటర్‌నెట్‌లో ‘షేమ్ ద రేపిస్ట్’ ప్రచారం చేపట్టిన సునీతా కృష్ణన్ కారుపై హైదరాబాద్ పాతబస్తీలో దుండగులు దాడిచేసిన ఉదంతంపై చర్యలు తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వ అలసత్వాన్ని కోర్టు తప్పుపట్టింది. దీనిపై వివరణనివ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వానికీ నోటీసులిచ్చిది. కాగా, సీబీఐ దర్యాప్తుతో పాటు ఇలాంటి నేరాలను అరికట్టేందుకు యూట్యూబ్, వాట్సాప్ సంస్థలతో కేంద్ర హోం శాఖ ఒప్పందం కుదుర్చుకునేలా ఆదేశించాలని ఎన్‌జీవో సీజేఐకి రాసిన లేఖలో కోరింది.
ఇదీ దారుణం.. వాట్సాప్‌లో షేర్ చేసిన వీడియోల్లో 4.5 నిమిషాల నిడివితో ఉన్న ఓ వీడియోలో.. ఓ వ్యక్తి బాలికపై అత్యాచారం చేస్తుండగా, మరో వ్యక్తి ఆ దారుణాన్ని వీడియో తీస్తున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయి. ఎనిమిదిన్నర నిమిషాలున్న మరో వీడియోలో.. ఐదుగురు కీచకులు ఓ బాలికను గ్యాంగ్‌రేప్ చేసిన దృశ్యాలు ఉన్నాయి. వెకిలిగా నవ్వుతూ, జోకులు వేసుకుంటూ, వీడియో తీస్తూ, ఫొటోలు తీసుకుంటూ, బాలికను లైంగికంగా బాధిస్తున్న దృశ్యాలు ఉన్నాయి.