నేలచూపులు చూస్తున్న ఐటీ సెక్టార్
ముంబై: విశ్లేషకులు భయపడ్డట్టుగానే ఐటీ సంస్థలు ప్రస్తుత క్వార్టర్ ఫలితాలు నిరాశాజనకంగా వెలువరించాయి. ముఖ్యంగా ప్రధాన ఐటీ సంస్థలు ఇన్ఫోసిస్, టీసీస్ ఆదాయాల్లో అంచనాలను కొద్దిగా అధిగమించినప్పటికీ ఇన్వెస్టర్లను గొప్పగా ప్రభావితం చేయలేక పోయాయి. ఇదే బాటలో విప్రో, మైండ్ ట్రీ ప్రకటించిన ఫలితాలు కూడా ఉండడంతో సోమవారం నాటి మార్కెట్లో ఐటీ సెక్టార్ నష్టాలను మూటగట్టుకుంటోంది. మైండ్ ట్రీ 5శాతం, విప్రో 4 శాతానికిపైగా ఇన్ఫోసిస్ 0.32, టీసీఎస్ ఒక శాతం నష్టాలను ఆర్జిస్తున్నాయి. దీంతో బీఎస్ఈలో ఐటి ఇండెక్స్ భారీగా నష్టపోతోంది. నిఫ్టీ50 ఇండెక్స్ లో 9 శాతం లాభంతో పోలిస్తే ఐటీ గత ఆరు నెలల్లో 10 శాతానికి పైగా నష్టపోయింది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపైనా పడింది.
శుక్రవారం మార్కెట్ల ముగిసిన తరువాత ప్రకటించిన మూడవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో, మరో సంస్థ మైండ్ ట్రీ ఆర్థిక ఫలితాలు కూడా అంతంత మాత్రంగానే ఉండడం ఐటీ రంగాన్ని ప్రభావితం చేస్తోంది. విప్రో రెండవ క్వార్టర్ ఫలితాల్లో లాభాల క్షీణత, ఇన్ఫోసిస్ పేలవమైన ఆదాయ వృద్ధి నమోదుతోపాటు, మూడు నెలల్లో రెండోసారి గైడెన్స్ కోత నిర్ణయంతో ఇన్వెస్టర్ల సెంటిమంట్ దెబ్బతింది. మరోవైపు మైండ్ ట్రీ కూడా నిరుత్సాహకర ఫలితాలు కూడా దీనికి తోడుకావడంతో భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఇదే బాటలో ఇతర ఐటీ మేజర్లన్నీ పయనిస్తున్నాయి.