
సీమాంధ్ర ఎంపీలకు పాసుల నిరాకరణ
న్యూఢిల్లీ : ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలను ఏఐసీసీ సమావేశానికి అధిష్టానం అనుమతి నిరాకరించింది. లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయిప్రతాప్, సబ్బం హరి, హర్షకుమార్లకు పాసులు నిరాకరించినట్లు సమాచారం.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశాల్లో పాల్గొనడం కాంగ్రెస్ నేతలు గౌరవంగా భావిస్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో వాడి, వేడిగా చర్చ కొనసాగుతున్న తరుణంలో ఢిల్లీ పెద్దలు ఈ మేరకు నిర్ణయం తీసుకోవటం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది.
కాగా ఏఐసీసీ భేటీలో పాల్గొనాలంటూ రాష్ట్రం నుంచి మొత్తం 150 మందికి ఆహ్వానం వచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో 76 మంది ఏఐసీసీ సభ్యులు కాగా, మిగిలిన వారు కో-ఆప్షన్, ఎక్స్‌అఫిషియో సభ్యులు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్, సేవాదళ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులను ఎక్స్‌అఫిషియో సభ్యులుగా పరిగణిస్తారు. మొత్తం సభ్యుల్లో సుమారు 20 మంది సభ్యులు పార్టీని వీడారు. కొందరు సభ్యులు చనిపోయారు. వీరి స్థానంలో కొత్తవారికి అవకాశమివ్వలేదు.