న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు ఏఐసీసీ సమావేశాలకు ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలకు ఆహ్వానం పంపింది. దాంతో ఏఐసీసీ సమావేశాలకు ఎంపీలు లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్ హాజరయ్యారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయిప్రతాప్, సబ్బం హరి, హర్షకుమార్లకు పాసులు నిరాకరించిన విషయం తెలిసిందే.
రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సమావేశాల్లో సీమాంధ్ర ఎంపీలు గందరగోళం సృష్టించవచ్చనే అనుమానంతో వారికి అనుమతి నిరాకరించినట్లు సమాచారం. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తటంతో కాంగ్రెస్ అధిష్టానం వెనక్కి తగ్గింది. కాగా ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హాజరు అయ్యారు.