విమానం మోత వెనక కుమ్మక్కు!
విమానం మోత వెనక కుమ్మక్కు!
Published Mon, Sep 9 2013 1:18 AM | Last Updated on Fri, Aug 17 2018 6:15 PM
ముంబై: ఒక్క వారంలో విమానయాన చార్జీలు 25 శాతం పెరగడం పట్ల ఎయిర్ ప్యాసింజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏపీఏఐ) విస్మయం వ్యక్తం చేసింది. విమానయాన సంస్థలన్నీ కుమ్మక్కై చార్జీలను పెంచాయని, ఆ సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ కాంపిటీషన్ వాచ్‌డాగ్ సీసీఐకి ఏపీఏఐ ఫిర్యాదు చేసింది. పండుగల సీజన్ సందర్భంగా దేశీయ విమానయాన సంస్థలు విమాన చార్జీలను పెంచడం రివాజుగా మారిందని సీసీఐ చైర్మన్ అశోక్ చావ్లాకు ఏపీఏఐ ఫిర్యాదు చేసింది. విమానయాన ఇంధనం (జెట్ ఫ్యూయల్) ధరలు పెరగడంతో పలు విమానయాన సంస్థలు, జెట్ ఎయిర్‌వేస్, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, ఇండిగో, గోఎయిర్ ఒకదాని తర్వాత మరొకటి విమాన చార్జీలను 25 శాతం పెంచాయి.
ఇలా పెంచడం కుమ్మక్కుకు నిదర్శనమని ఏపీఏఐ అధ్యక్షుడు డి. సుధాకర రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తక్షణం సీసీఐ జోక్యం చేసుకోవాలని కోరారు. చార్జీలను తగ్గించినప్పుడు విస్తృత ప్రచారం నిర్వహించే కంపెనీలు చార్జీలు పెంచినప్పుడు మాత్రం కనీసం పత్రికా ప్రకటన కూడా చేయడం లేదని, పైగా పెంచిన చార్జీలు తక్షణం అమల్లోకి వచ్చాయని వివరించారు. సవివరమైన దర్యాప్తు జరిపి కుమ్మక్కు నుంచి సాధారణ ప్రజలను రక్షించాలని ఏపీఏఐ కోరింది.
Advertisement