న్యూఢిల్లీ: రుణభారంతో కుంగుతున్న ఎయిరిండియాలో వాటాల కొనుగోలు రేసు నుంచి పోటీ సంస్థలు ఒక్కొక్కటిగా తప్పుకుంటున్నాయి. ఎయిరిండియా డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో తాము పాల్గొనడం లేదంటూ తాజాగా జెట్ ఎయిర్‌వేస్ వెల్లడించింది. ఇప్పటికే చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో పక్కకు తప్పుకోగా .. వారం రోజుల వ్యవధిలోనే జెట్ కూడా వైదొలగడం గమనార్హం.
‘ఎయిరిండియాను ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు స్వాగతిస్తున్నాం. ఇది సాహసోపేతమైన నిర్ణయం. కానీ ఈ ప్రక్రియలో మేం పాల్గొనడం లేదు. వాటాల విక్రయానికి సంబంధించిన ఆఫర్‌లో నిబంధనలు, షరతులు మొదలైన వాటన్నింటినీ పరిశీలించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నాం‘ అని జెట్ ఎయిర్‌వేస్ డిప్యూటీ సీఈవో అమిత్ అగర్వాల్ పేర్కొన్నారు. అయితే, డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో పాల్గొనకపోవడానికి గల నిర్దిష్ట కారణమేదీ ఆయన వెల్లడించలేదు.
జెట్ ఎయిర్‌వేస్, ఎయిర్‌ఫ్రాన్స్–కేఎల్‌ఎం, డెల్టా ఎయిర్‌లైన్స్ కలిసి ఎయిరిండియా కోసం బిడ్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఎయిరిండియాతో పాటు రెండు అనుబంధ సంస్థల్లో వ్యూహాత్మక వాటాల విక్రయ ప్రక్రియ చేపట్టాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎయిరిండియాలో 76 శాతం వాటాలను విక్రయించడంతో పాటు యాజమాన్య అధికారాలను కూడా ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం బదలాయించనుంది. ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు దాఖలు చేయడానికి మే 14 ఆఖరు తేదీ కాగా.. అర్హత పొందిన బిడ్డర్లకు మే 28న సమాచారం తెలియజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment