అమెరికా ఆంక్షలు: ఆ రెండింటికి తెగ లాభం
అమెరికా ఆంక్షలు: ఆ రెండింటికి తెగ లాభం
Published Wed, Mar 22 2017 8:39 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం తీసుకున్న మరో వివాదాస్పద నిర్ణయం దేశీయ విమానయసంస్థలకు లాభం చేకూర్చనుందట. కెమెరాలు, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రిక్ పరికరాలను ఎనిమిది ముస్లిం దేశాల నుంచి వచ్చే విమానాల క్యాబిన్లలోకి తీసుకురాకుండా ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలతో దేశీయ విమానసంస్థలు జెట్ ఎయిర్ వేస్, ఎయిర్ ఇండియాలు లబ్ది పొందనున్నాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఎక్కువ సమయం ప్రయాణించే బిజినెస్ ట్రావెలర్స్ కచ్చితంగా ల్యాప్ టాప్స్, ఐప్యాడ్స్ ను ఆన్ బోర్డులో తీసుకెళ్తుంటారు. కానీ తాజా ఆదేశాలతో బిజినెస్ ట్రావెలర్స్ సమావేశాల కోసం ముందస్తుగా సన్నద్ధమయ్యే ఆన్ బోర్డు వర్క్ పై ప్రభావం పడనుంది. దీంతో ల్యాప్ టాప్స్ ను అనుమతించే విమానాలనే వారు ఎంపికచేసుకుంటారని ఆన్ లైన్ పోర్టల్ యాత్రా.కామ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శరత్ ధాల్ చెప్పారు. ఆన్ బోర్డులో ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించే జెట్ ఎయిర్ వేస్, ఎయిర్ ఇండియాలనే వారు ఇక ఎక్కువగా ఎంపికచేసుకునే అవకాశముంటుందని తెలిపారు.
అయితే ఈ విషయంపై జెట్ ఎయిర్ వేస్ స్పందించలేదు. ఎయిర్ ఇండియా మాత్రం తాము ఈ ఆదేశాలతో లబ్ది పొందుతామని విశ్వసిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం అమెరికాకు వెళ్లే తమ విమానాలు 90 శాతం వరకు సీట్లు నిండిపోయాయి, చాలావరకు సర్దుబాటు చేయలేకపోతున్నామని ఓ సీనియర్ ఎయిర్ ఇండియా అధికారి చెప్పారు. తాజాగా జారీఅయిన ఆదేశాల్లో 10 అంతర్జాతీయ విమానశ్రయాల నుంచి అమెరికాకు, యూకేకు ప్రయాణించే నాన్ స్టాప్స్ విమానాలపై ఆంక్షలు విధించారు. కైరో(ఈజిప్టు), దుబాయి, అబుదాబీ(యూఏఈ), ఇస్తాంబుల్(టర్కీ), దోహ(ఖతార్), అమ్మన్(జోర్డాన్), కువైట్ సిటీ, కాసాబ్లాంకా(మొరాకో), జెడ్డా, రియాద్(సౌదీఅరేబియా) నగరాల్లోని 10 అంతర్జాతీయ విమానశ్రయాలపై ఈ ఆంక్షల ప్రభావం పడనుంది. దీంతో ఆ మార్గాల గుండా ప్రయాణించే వారు ఇక దేశీయ విమానాలను ఎంచుకునే అవకాశముంటుంది.
Advertisement
Advertisement