న్యూఢిల్లీ: త్వరలో ఎయిర్పోర్ట్ ల్లో కొత్త కస్టమ్స్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దేశం విడిచి వెళ్లే భారతీయులు ఎయిర్ పోర్ట్ ల్లో కొత్తగా ప్రవేశపెట్టనున్నకస్టమ్స్ దరఖాస్తును పూరించాల్సి ఉంటుంది. వారు ఎంతకాలం విదేశాల్లో ఉండదలుచుకున్నారు, ఎప్పుడు తిరిగి స్వదేశానికి చేరుకుంటారు తదితర వివరాలను అందులో పొందుపరచాల్సి ఉంటుంది. ఈ విధానం అమల్లోకి వస్తే విదేశాల నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఎటువంటి ఇమ్మిగ్రేషన్ దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాగా విదేశాల నుంచి తిరిగి వచ్చే సమయంలో మాత్రం దేశీయ ఎయిర్ పోర్ట్ ల్లో కస్టమ్స్ కు సంబంధించిన దరఖాస్తులో ప్రయాణికుల పూర్తి వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. దేశం లో కరెన్సీ బెడద, నిషేధిత వస్తువులను నిషేధించే క్రమంలో భాగంగానే కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది మరో రెండు నెలల్లో దేశంలోని ఎయిర్ పోర్ట్ ల్లో అమలు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. జనవరి 1 వ తేదీ నుంచి ఈ విధానాలపై కసరత్తు ఆరంభించామన్నారు. కాగా అమల్లోకి రావడానికి మరో రెండు నెలలు సమయం పడుతుందని హోం శాఖ వెల్లడించింది. మార్చి తొలి వారం నుంచి ఈ విధానాన్ని సమర్ధవంతంగా అన్ని ఎయిర్ పోర్ట్ ల్లో అమలు చేస్తామని పేర్కొంది.