నువ్వా నేనా అంటున్న టెలికం కంపెనీలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆఖరులో చౌక ధరలకు రిలయన్స్ జియో స్మార్ట్ హ్యాండ్ సెట్స్ను విడుదల చేసి 4 జీ సర్వీసులను అందించేందుకు రిలయన్స్ సంస్థ సిద్థమవుతుండగా.. దానిని ఢీకొనేందుకు ఇప్పుడు ఎయిర్టెల్ సిద్ధమవుతుంది. అంతకంటే ముందే తాము అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్యుయెల్ సిమ్ సపోర్ట్ స్మార్ట్ హ్యాండ్ సెట్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎయిర్ టెల్ అధికార వర్గాలు తెలిపాయి.
రూ.4000 వేలకే స్మార్ట్ ఫోన్ అందించి నెలకు కనీసం రూ.300 నుంచి రూ.400 మాత్రమే ఫోన్ బిల్లు వచ్చేలా 4 జీ సేవలు అందిస్తామని ఇటీవలె రిలయన్స్ దిగ్గజం ముఖేశ్ అంబానీ చెప్పారు. ఆ సర్వీసులు ఈ ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. అయితే, తాము అక్టోబర్ లేదా నవంబర్ నెలలోనే రూ.4000 వేల నుంచి రూ.12,000 వేల మధ్యలో స్మార్ట్ ఫోన్లు అందించి 4 జీ సేవలు అందిస్తామని ఎయిర్ టెల్ తెలిపింది.