
సెక్షన్-8తో ఎవరికి ఉపశమనం?
ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో తమకు ఏమాత్రం రక్షణ లేదని, అందువల్ల ఇక్కడ తప్పనిసరిగా విభజన చట్టంలోని సెక్షన్-8 అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రుల దగ్గర్నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు అందరూ డిమాండు చేస్తున్నారు. గవర్నరే శాంతిభద్రతలను చూడాలని తొలుత చెప్పినా.. చివరకు తమ రక్షణను తమ పోలీసులే చూసుకుంటారంటూ పూర్తిగా ఆ అంశాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు సెక్షన్ -8 అంటే ఏంటి? రేవంత్ అండ్ కో చేసిన తప్పు నుంచి అది ఎవరికైనా ఉపశమనం కల్పిస్తుందా? ఇంతకీ సెక్షన్-8 ఏం చెబుతోందో ఒక్కసారి చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ విభజన, పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న సమయంలో శాంతిభద్రతల కోసం ఏర్పాటు చేసినదే సెక్షన్-8. రాష్ట్ర ఆవిర్భావ తేదీ నుంచి ఉమ్మడి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ పాలన సజావుగా నిర్వహించే క్రమంలో ఇక్కడి ప్రజలందరి భద్రత, స్వేచ్ఛ, వారి ఆస్తుల రక్షణ విషయంలో గవర్నర్ ప్రత్యేక బాధ్యత కలిగి ఉంటారు. ఇది సెక్షన్-8లోని మొదటి రూల్. రెండోది శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, ఆస్తుల రక్షణ, అలాగే ఉమ్మడి రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ భవనాల కేటాయింపు, నిర్వహణ వంటి విషయాలపై గవర్నర్ తన బాధ్యతలు విస్తరించవచ్చని చెబుతోంది. మూడో రూల్ విధుల నిర్వహణలో తెలంగాణ మంత్రిమండలిని సంప్రదించిన మీదట గవర్నర్ తన వ్యక్తిగత విచక్షణ మేరకు తదుపరి చర్యలకు ఉపక్రమించవచ్చని చెబుతోంది. నాలుగో రూల్ గవర్నర్‌కు విధుల్లో సహకరించేందుకు కేంద్రం ఇద్దరు సలహాదారులను నియమిస్తుంది.
మొత్తంగా సెక్షన్ 8 చెప్పేది ఒకటే. ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలున్నాయి. అక్కడ ప్రజల ప్రాణాలు, ఆస్తులు, స్వేచ్ఛకు ఇబ్బందులు ఏర్పడినపుడు గవర్నర్ ఆ బాధ్యతలు నిర్వహించే అవకాశముంది. తెలంగాణ మంత్రి మండలిని సంప్రదించి తర్వాత తన విచక్షణ మేరకు చర్యలు చేపట్టవచ్చు. ఆ క్రమంలో శాంతి భద్రతల్లాంటి అంశాలకు కూడా ఆయన బాధ్యతలు విస్తరించవచ్చు. ఇందుకోసం కేంద్రం నియమించిన సలహాదారుల సేవలు వినియోగించుకోవచ్చు. ఆయన చర్యలను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ఇదీ సెక్షన్ 8 చెప్పే మాట. ఇందులో ఎక్కడా ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించాలని గానీ లేదా సలహా తీసుకోవాలన్న మాట, ప్రస్తావన లేనే లేదు. అంటే ఏపీ ప్రభుత్వానికి సెక్షన్-8తో ఏ ప్రమేయమూ లేదని చట్టం స్పష్టం చేస్తోంది.
ఏపీ పోలీసు బలగాలను హైదరాబాద్ రప్పించడం చట్ట విరుద్ధమన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన. చంద్రబాబు చెన్నై వెళ్లినా అక్కడి ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందే తప్ప సొంత రక్షణ తీసుకుపోలేరని వారు గుర్తుచేస్తోంది. కేసులో ఇప్పటికే వీడియో, ఆడియో సాక్ష్యాలు బయటకు వచ్చినందున న్యాయస్థానాల్లో చంద్రబాబుకు ఉపశమనం లభించడం అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి.