తొమ్మిదేళ్ల మా స్నేహాన్ని చిదిమేశారు | alok reddy remembers his nine year friendship with srinivas kuchibhotla | Sakshi
Sakshi News home page

తొమ్మిదేళ్ల మా స్నేహాన్ని చిదిమేశారు

Published Tue, Feb 28 2017 10:17 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM

తొమ్మిదేళ్ల మా స్నేహాన్ని చిదిమేశారు

తొమ్మిదేళ్ల మా స్నేహాన్ని చిదిమేశారు

► ఇదంతా కల అయి ఉంటే ఎంత బాగుండేది
► నేను కారు కొనేవరకు శ్రీనివాస్ కూడా కొనలేదు
► చొక్కాతో కట్టు కట్టకపోతే నా ప్రాణాలూ పోయేవి
► అమెరికా కాల్పుల్లో గాయపడిన అలోక్ రెడ్డి
► చేతి కర్రలతో వచ్చి సంస్మరణ సభలో పాల్గొన్న అలోక్
ఓలేత్ (అమెరికా): 
ప్రాణస్నేహితుడిని పోగొట్టుకున్న బాధ అలోక్ రెడ్డి గుండెలను పిండేసింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతూనే కూచిభొట్ల శ్రీనివాస్ సంస్మరణార్థం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి చేతికర్రల సాయంతో నడుస్తూ వచ్చారు. శ్రీనివాస్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఓలేత్ నగరంలోని బాల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో ఇండియా అసోసియేషన్ ఆఫ్ కాన్సాస్ సిటీ వాళ్లు ఏర్పాటుచేసిన ఈ సంస్మరణ సభలో అలోక్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ''ఇదంతా ఓ కల అయితే బాగుండనిపిస్తోంది. అసలు నేను ఇక్కడకు రావడానికి ప్రధాన కారణం శ్రీనివాసే. అతడు కూడా ఇప్పుడు నాతో ఉండి ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తోంది. తొమ్మిదేళ్ల నుంచి మేమిద్దరం మంచి స్నేహితులం. ఇద్దరం కలిసే ఉద్యోగానికి వెళ్లేవాళ్లం, తిరిగి వచ్చేటప్పుడు సరదాగా గడిపేవాళ్లం. ఇక్కడ కష్టంగా ఉందని గానీ, తిరిగి వెళ్లిపోదామని గానీ శ్రీనివాస్ ఏరోజూ చెప్పలేదు. గత ఆరు నెలలుగా ప్రతిరోజూ నా అపార్టుమెంటు దగ్గరకు వచ్చి, తన కారులో ఎక్కించుకుని ఆఫీసుకు తీసుకెళ్లేవాడు. నేను కారు కొనేవరకు కూడా తను కొనకుండా ఆగాడు. అంత మంచి మనసు మా శ్రీనుది. నేను కారు కొన్నా కూడా దాన్ని బయటకు తీయాల్సిన అవసరం రాలేదు'' అని అలోక్ చెప్పారు. 
 
పిచ్చి ఆవేశంలో ఒక వ్యక్తి చేసిన నేరం వల్ల తాను తన ప్రాణస్నేహితుడిని కోల్పోయి ఇక్కడ ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన ఘటనే తప్ప కాన్సాస్ ప్రాంత అసలైన స్ఫూర్తిని ఏమాత్రం దెబ్బతీయలేదని అన్నారు. దాంతో ఒక్కసారిగా ఆ సదస్సు జరిగిన హాల్ చప్పట్లతో మార్మోగింది. అమెరికాలో నిస్వార్థపరులు, కష్ట జీవులు ఉంటారని, ఆరోజు రాత్రి జరగకూడని ఘటన జరిగిందని అలోక్ చెప్పారు. 
 
ఆ షర్టు లేకపోతే...
కాల్పులు జరిగిన రోజున తమను కాపాడేందుకు వచ్చింది ఒకరు కాదు.. ఇద్దరని అలోక్ రెడ్డి తెలిపారు. ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదు గానీ, ఆయన తాను వేసుకున్న షర్టు తీసి, తనకైన బుల్లెట్ గాయం నుంచి అవుతున్న రక్తస్రావాన్ని ఆపడానికి కట్టుకట్టారని చెప్పారు. ఆయన అలా కట్టకపోతే.. తీవ్ర రక్తస్రావం కారణంగా తన ప్రాణాలు కూడా పోయి ఉండేవని అంబులెన్సులో ఉన్నవాళ్లు తనకు తెలిపారన్నారు. అమెరికన్లంతా సహనం కలిగి ఉండాలని, మానవత్వం పట్ల గౌరవం ఉండాలని చెబుతూ.. తాను ఎక్కువ ఏమీ అడగట్లేదని, తన స్నేహితుడు కూడా ఇదే కోరుకుంటాడని అలోక్ చెప్పారు. 
 
అమెరికాలో జాతివిద్వేషంపై మరిన్ని కథనాలు చూడండి...
 



 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement