మీ నిర్ణయానికి ప్రాతిపదిక ఏమిటి? : అంబటి రాంబాబు | Ambati rambabu takes on congress party | Sakshi
Sakshi News home page

మీ నిర్ణయానికి ప్రాతిపదిక ఏమిటి? : అంబటి రాంబాబు

Published Tue, Aug 13 2013 3:17 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

మీ నిర్ణయానికి ప్రాతిపదిక ఏమిటి? : అంబటి రాంబాబు - Sakshi

మీ నిర్ణయానికి ప్రాతిపదిక ఏమిటి? : అంబటి రాంబాబు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నాయకత్వం రోజుకో కొత్త డ్రామా ఆడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. తెలంగాణ అంశంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఇచ్చిన సమాధానం కాంగ్రెస్ ఆడుతున్న మరో డ్రామాగా అభివర్ణించారు. రాజ్యసభలో జరిగిన చర్చకు కేంద్ర హోం శాఖ మంత్రి తరఫున ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం ఒకదానికొకటి పొంతనలేని సమాధానమిచ్చారని అంబటి ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. అసలు రాష్ట్ర విభజనకు దేన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు? కాంగ్రెస్ పార్టీగా తన అభిప్రాయం వెల్లడించిన తర్వాత దాన్నే ప్రాతిపదికగా తీసుకున్నారా? గతంలో మీరు నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ నివేదికను ప్రాతిపదికగా తీసుకున్నారా? తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖను ప్రాతిపదికగా తీసుకున్నారా? కాంగ్రెస్ పార్టీగా తీసుకున్న నిర్ణయంతోనే ముందుకు వెళుతున్నారా? రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్న ప్రాతిపదిక ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీగా తీసుకున్న నిర్ణయంతోనే ముందుకు వెళతామంటే అదైనా చెప్పాలి. లేదా శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా అయితే అదైనా చెప్పాలి. అవేవీ కాదు రాజ్యాంగం ప్రకారం మాకు అధికారం ఉంది... మా ఇష్టం అంటే అదైనా ప్రజలకు చెప్పాల్సిన అవసరముందని అన్నారు.
 
  తెలంగాణపై నిర్ణయం అయిపోయింది. ప్రస్తుత సమావేశాల్లోనో లేదా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనో బిల్లు పెడతామని కాంగ్రెస్ నాయకులు చెబుతుంటే దానికి కాలపరిమితి లేదనీ, తేదీ చెప్పలేనని చిదంబరం రాజ్యసభలో చెబుతున్నారంటే కాంగ్రెస్ ఒక పథకం ప్రకారం రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని అంబటి విమర్శించారు. కాంగ్రెస్ నిర్ణయానికి రావడానికి ముందు అనేక విధాలుగా చర్చలు, సంప్రదింపులు జరిగాయని చిదంబరం రాజ్యసభలో చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ ఎవరితో చర్చలు జరిగాయో చెప్పాలన్నారు. ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఎవరి ముందు పెట్టారన్నారు. ఎవరితో చర్చించాలో చెప్పాలన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకున్నాం... ఇక వెనక్కిపోయేది లేదని సోనియాగాంధీ చెబుతుంటే అది పార్టీ నిర్ణయం మాత్రమేననీ చిదంబరం చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.
 
 చర్చలు, సంప్రదింపులు జరిగాయన్నప్పుడు మళ్లీ ఆంటోనీ కమిటీ ఎందుకు వేసినట్టు? అసలు ఆ కమిటీకి ఉన్న చట్టబద్ధత ఏమిటి? ఎవరిని అడిగి ఆ కమిటీ వేశారు? ఎందుకోసం వేశారు? ఏదైనా అడిగితే ఆంటోనీ కమిటీకి చెప్పుకోండని అంటున్నారంటే... అసలు కాంగ్రెస్ ఉద్దేశమేంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీగా తన నిర్ణయం ప్రకటించిన తర్వాత దానిపై అన్ని ప్రాంతాల అభిప్రాయాలు తీసుకుని ఒక తండ్రి హోదాలో నిర్ణయం తీసుకోవాలని తాము కోరుతున్నామనీ అలా కాకుండా కాంగ్రెస్ ఇదేదో తమ సొంత వ్యవహారంగా భావిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర విభజన అంశంపై చిదంబరం రాజ్యసభను తప్పుదారి పట్టించారని, ఒకదానికి, ఇంకొకదానికి పొంతన లేకుండా మాట్లాడారని అంబటి దుయ్యబట్టారు.
 
 కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి రావడానికి శ్రీకృష్ణ కమిటీ ఎంతో సమాచారం ఇచ్చిందని చిదంబరం చెప్పడమంటే శ్రీకృష్ణ కమిటీ నివేదికను ప్రాతిపదికగా తీసుకున్నట్టు భావించాలా? అలాంటప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ చేసిన ఆరవ సిఫారసు అన్నింటికన్నా అత్యుత్తమమని ఆ కమిటీ చెప్పిన విషయాన్ని విస్మరించారా? హైదరాబాద్ అంశం అందరితో మాట్లాడుతామని చెబుతున్నారే... అంటే మిగతా విషయాలన్నీ పరిష్కారమైనట్టేనా? తమది తొందరపాటు నిర్ణయం కాదని ఒకవైపు చెబుతూ మరోవైపు అందరితో చర్చిస్తామని చెప్పడంలోని ఆంతర్యమేంటి? జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు రెండేళ్ల సమయం పట్టిందని చెబుతున్నారంటే... ఎన్నికల కోసం ఆడుతున్న డ్రామా కాక మరేమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఒకసారేమో అందరితో చర్చిస్తామంటారు. మరోసారేమో అనేక చర్చలు, సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నామంటారు. ఇంకోసారేమో పార్టీల అంతర్గత విషయాలను చర్చించడానికి ఇది వేదిక కాదంటారు. మళ్లీ నిర్ణయం తీసుకునే ముందు ప్రతి రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని తీసుకునే తెలంగాణపై ముందుకెళతామంటారు. తెలంగాణ ఇవ్వాలని తాము తీసుకున్నది తొందరపాటు నిర్ణయం కాదంటారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు సందర్భంలో అనేక అంశాలపై చర్చించాల్సి ఉందంటారు. రాజ్యసభలో ఇప్పుడా విషయాలను చర్చించడం అపరిపక్వత అంటారు. కేబినెట్ నిర్ణయం తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్ నేతృత్వంలోని కమిటీకి అన్ని విషయాలు చర్చించొచ్చంటారు.
 
 తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇచ్చిందంటారు. రాజ్యసభలో మీరు ఈ రకంగా చెబుతుంటే బయట మీ పార్టీ నేతలేమో ఆంటోనీ కమిటీ వేశాం. ఏదైనా ఉంటే ఆ కమిటీతో చెప్పుకోవాలంటారు. ఏమిటిదంతా. రాష్ట్రమంటేనే మీకు తమాషా అయిపోయింది’’ అంటూ రాంబాబు తీవ్రస్థాయిలో కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. 2009 డిసెంబర్ 9న ప్రకటన చేసి అదే నెల 23న వెనక్కి తీసుకున్న చిదంబరం మూడున్నర సంవత్సరాల తర్వాత తాజాగా రాజ్యసభలోనూ అలాంటి గందరగోళమైన మాటలే చెప్పారని దుయ్యబట్టారు. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి రాష్ట్ర ప్రజలను తీవ్ర గందరగోళంలోకి నెట్టి... అభద్రతాభావానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలేమైపోయినా ఫరవాలేదు... కేవలం ఓట్లు, సీట్ల లెక్కలతో ముందుకెళతామని కాంగ్రెస్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని, తమ పార్టీ ముందునుంచీ ఇదే విషయా న్ని చెబుతోందని పేర్కొంటూ సరైన సమయంలో ప్రజలు కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి  చెబుతారని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement