ఏమోయ్.. సినిమాకెళ్తున్నా..
ఏమోయ్..
సినిమాకెళ్తున్నా..
ఆ రెండు సూట్‌కేసుల నిండా బట్టలు సర్దావా..
పేస్టు, బ్రష్షు, సబ్బులు పెట్టావా..
అవునోయ్.. నా బీపీ ట్యాబ్లెట్లు పెట్టడం మరిచిపోకు సుమీ..
అన్నీ సర్దానండీ..
సినిమా మధ్యలో తినడానికి పడుంటాయని
5 కిలోల పల్లీలు వేయించి పెట్టానండీ..
బయట తిండి మీకు పడదాయే..
అందుకే ఓ రెండు జాడీల ఊరగాయ.. కిలో చల్ల మిరప కాయలు కూడా డబ్బాలో పెట్టి.. బ్యాగులో పెట్టానండీ..
గుమ్మం దగ్గర సతీమణి హారతిచ్చి.. వీర తిలకం దిద్దగా.. కుటుంబరావు ‘ఆంబియన్స్’ సినిమాకి
విజయోత్సాహంతో బయలుదేరాడు..
ఏంటిదీ అనుకుంటున్నారా.. ఓ సినిమా కెళ్లడానికి ఇంత సెటప్ ఎందుకనుకుంటున్నారా.. 2020లో రిలీజ్ అయ్యే ‘ఆంబియన్స్’ సినిమా నిడివి ఏకంగా 720 గంటలు!! రోజుల్లో చెప్పాలంటే.. 30 రోజులు.. అందుకే ఇదంతా అన్నమాట. దీన్ని తీస్తోంది స్వీడిష్ డైరెక్టర్ ఆండర్స్ వెబర్గ్. 20 ఏళ్లపాటు విజువల్ ఆర్ట్స్ రంగంలో పనిచేసిన వెబర్గ్.. 2020లో తన కెరీర్‌ను ముగించాలనుకుంటున్నాడు. అంతలోగా.. ప్రపంచమంతా గుర్తుంచుకునేలా ఏదైనా చేయాలనుకున్నాడు. దీంతో ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన సినిమా తీయడానికి సంకల్పించాడు.
తాను కొత్త విధానంలో తీస్తున్నానని.. దీనికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. ప్రపంచంలో అత్యంత సుదీర్ఘమైన సినిమా ‘మోడరన్ టైమ్స్ ఫరెవర్’ అని అది 240 గంటల నిడివి ఉందని.. ఇప్పటికే ఆంబియన్స్ చిత్రానికి సంబంధించి 400 గంటల షూటింగ్ పూర్తి చేసేశానన్నాడు. ఇంకో ట్విస్టేమిటంటే.. ఇది మూకీ సినిమానట.. అంటే డైలాగులు నిల్.. ఈ మధ్య సినిమాల్లో డైలాగుల వాడకం బాగా పెరిగిపోయిందని.. ఓ మంచి విషయాన్ని చెప్పడానికి మాటలు అవసరం లేదంటున్నాడు వెబర్గ్. మొత్తం 100 మంది నటులు ఉన్న ఈ సినిమాకు నిర్మాత కూడా అతడే. 2018లో టీజర్‌ను కూడా రిలీజ్ చేయనున్నాడు. దీని నిడివి జస్ట్ 72 గంటలు!
2020లో ఒకేసారి అన్ని దేశాల్లో దీన్ని విడుదల చేస్తారట. పైగా.. ఒకే షో వేస్తారట. తర్వాత మళ్లీ దాన్ని ఎవరూ ప్రదర్శించకుండా ఉండటానికి..
ఈ సినిమా కాపీలను తగుల బెట్టే యోచనలో ఉన్నాడు వెబర్గ్.. అతడి పిచ్చి గానీ..
జనం ఆ చాన్స్ అతడికి ఇస్తారంటారా??