ఒక జత బట్టలు మాత్రమే ఉన్నాయి: సీఎం
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నుంచి గొప్ప విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ‘ఈ రోజుల్లో సన్యాసులకు ప్రజలు భిక్ష కూడా వేయడం లేదు. ప్రధాని మోదీ ఏకంగా నాకు ఉత్తరప్రదేశ్ ఇచ్చారు. సానుకూలంగా ఎలా ఆలోచించాలి, గొప్ప పనులు ఏవిధంగా చేయాలనేది ఆయన నుంచి నేర్చుకున్నాన’ని సీఎం యోగి చెప్పారు.
తాను ముఖ్యమంత్రి అవుతానని అనుకోలేదని పేర్కొన్నారు. ‘రేపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ప్రమాణ స్వీకారానికి ముందురోజు అమిత్ షా నాతో చెప్పారు. హఠాత్తుగా అలా చెప్పడంతో ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నా దగ్గర ఒక జత బట్టలు మాత్రమే ఉన్నాయ’ని వెల్లడించారు. పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. యూపీ పట్టిన రోగం ఏంటో తనకు తెలుసునని, దాన్ని వదిలించేందుకు ప్రయత్నిస్తానని సీఎం యోగి చెప్పారు.