
విద్యార్థి నేతలపై ఆనం అనుచరుల దాడి
నేడు ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన : ఎన్జీవోలు
నెల్లూరు (క్రైమ్), న్యూస్‌లైన్: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అనుచరులు గురువారం రాత్రి సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులపై దాడికి పాల్పడ్డారు. దాంతో విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ ప్రసాద్, నాయకుడు మధు గాయాలపాలయ్యారు. ‘ఆనంకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తారా? మీరు ఎన్‌జీవోలతో కలిసి పనిచేస్తే సహించేది లేదు’ అంటూ ఆనం అనుచరులు తమపై దాడికి దిగినట్టు బాధితులు చెప్పారు. వారు చెప్పిన వివరాల మేరకు... వేదాయపాళెం సెంటర్‌కు చెందిన యజ్దాని గురువారం సాయంత్రం విద్యార్థి జేఏసీ నేత ప్రసాద్‌కు ఫోను చేసి, ‘కాంగ్రెస్ పార్టీని, ఆనంను విమర్శిస్తే చంపుతా’మని బెదిరించాడు.
దాంతో ప్రసాద్ తన స్నేహితులతో కలిసి యజ్దానిని పట్టుకుని పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రసాద్ ఎన్‌జీవో హోమ్‌లో సమావేశంలో పాల్గొని సహచరుడు మధుతో కలిసి ఇంటికి వెళ్తుండగా ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ముజీర్, అతని అనుచరులు అలీ, యజ్దాని, హాజీ మరో 30 మంది బైక్‌లపై వచ్చి వారిపై దాడి చేశారు. దీనిపై బాధితులు ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థి నేతలపై దాడి అమానుషమని, నిందితులనను అరెస్టు చేయాలని ఎన్‌జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు చొప్పా రవీంద్రబాబు అన్నారు. దాడిని నిరసిస్తూ శుక్రవారం ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు.