ఏపీ సర్కారుకు కేంద్ర అటవీ కమిటీ ఝలక్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అటవీ సలహా కమిటీ నుంచి చుక్కెదురైంది. హరిత రాజధానిగా అమరావతిని నిర్మిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదించడానికి కమిటీ నిరాకరించింది. భూ వినియోగ ప్రణాళికతోపాటు అఫారెస్టేషన్ (తొలగించిన మేర అటవీ ప్రాంతాన్ని మరోచోట పునర్ నిర్మించే) పథకాన్ని సమర్పించే వరకు ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలుపబోమని స్పష్టం చేసింది.
నూతన రాజధాని నిర్మాణం కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీకి 13,267.12 ఎకరాల అటవీభూమిని మళ్లించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కమిటీని కోరింది. ఇందుకోసం ఏప్రిల్ 25న సవరించిన ప్రతిపాదనలను సమర్పించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేసే అటవీ సలహా కమిటీ (ఎఫ్‌ఏసీ) ఈ ప్రతిపాదనలను జూలై 12న పరిశీలించి.. తాజా సమావేశంలో సమగ్రంగా చర్చించింది. భూవినియోగ ప్రణాళికతోపాటు ఇతర నిబంధనల నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని ఈ భేటీలో ఏపీ సర్కారు విజ్ఞప్తి చేసింది. ఇందుకు నిరాకరించిన ఎఫ్‌ఏసీ.. సమగ్ర భూవినియోగ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం తమకు తప్పకుండా సమర్పించాల్సిందేనని స్పష్టంచేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి.