ఇంటర్య్వూపై కుంబ్లే ఏమన్నాడంటే..
ధర్మశాల:'భారత క్రికెట్ కోచ్ ఎంపికలో పూర్తి పారదర్శకతతో వ్యవహరించాం. కుంబ్లేపై విశ్వాసం ఉంచే బీసీసీఐ అతనికి కీలక బాధ్యతలు అప్పగించింది. ఇక్కడ దేశీయత, విదేశీయత అనేది ప్రధానం కాదు. ఈ ప్రక్రియలో అన్ని అంశాలను పరిశీలించిన తరువాతే కుంబ్లే సరైన వ్యక్తి అని భావించాం. ఆ పనిని అడ్వాయిజరీ కమిటీకి కేటాయించాం. సచిన్, గంగూలీ, లక్ష్మణ్లతో కూడిన బృందం పలువురు అభ్యర్థుల్ని పరిశీలించిన తరువాత కుంబ్లేకు ఓటేసింది'అని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవిపై అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు. అయితే ఇంటర్య్యూకు హాజరైన క్రమంలో కుంబ్లేకు ఎదురైన పరిస్థితులు అతని మాటల్లోనే..
'నేను ఇంటర్య్వూకు హాజరు కావడం ఒక ప్రత్యేక అనుభవం. ఒక జాబ్ కోసం ఇంటర్య్యూకు వెళ్లడం నా జీవితంలో ఇదే తొలిసారి. సచిన్, లక్ష్మణ్, గంగూలీలు నా సమకాలీన క్రికెటర్లు. వారితో ఎన్నో మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. జట్టు సమావేశాల్లో చాలా సార్లు పాల్గొన్నా. అవన్నీ సర్వ సాధారణంగా జరిగే సమావేశాలు కావడంతో ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. కాగా, ఇంటర్య్యూకు హాజరైనప్పుడు మాత్రం చాలా ఒత్తిడికి లోనయ్యా. చాలా కొత్తగా అనిపించింది. అవతలి టేబుల్పై గంగూలీ, లక్ష్మణ్లు ఉంటే మరోవైపు నేను కూర్చున్నా. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సచిన్ ఇంటర్య్వూలో పాల్గొన్నాడు. ఆ ముగ్గురికి ఇంటర్య్వూ ఇచ్చేటప్పుడు ఒత్తిడిని ఎదుర్కొన్నా. అయినప్పటికీ జట్టుకోసం నా ప్రణాళిక ఏమిటో వారికి బాగానే వివరించా' అని కుంబ్లే కోచ్ గా ఇంటర్య్వూలో ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. ఈ ముగ్గురితో పాటు రాహుల్ ద్రవిడ్తో కూడా నాకు మంచి సాన్నిహిత్యమే ఉంది. అప్పుడు, ఇప్పుడు వారితో అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది. రాబోవు రోజుల్లో కూడా భారత క్రికెట్ జట్టు మరింత ముందుకెళ్లడానికి మా వంతు పాత్రను సమర్ధవంతంగా నిర్వర్తిస్తాం' అని కుంబ్లే అన్నాడు.
కోచ్ పదవి చాలా పెద్ద బాధ్యతని కుంబ్లే తెలిపాడు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నాడు. విండీస్‌తో రాబోయే సిరీస్‌కు తన వద్ద స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయన్నా కుంబ్లే.. ఇందులో ఆటగాళ్లను భాగస్వామ్యులను చేయాలని పేర్కొన్నాడు.