న్యూయార్క్ ఇండియా పెరేడ్ డేకు అన్నా హజారే
సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే, బాలీవుడ్ నటి విద్యాబాలన్ తదితరులు అమెరికాలోని మన్హట్టన్లో జరిగిన అతిపెద్ద ఇండియా డే పెరేడ్కు నాయకత్వం వహించారు. న్యూయార్క్ ప్రాంతంలో ఉన్న భారతీయులు వరుసగా 33వ ఏడాది వార్షిక ఇండియా డే పెరేడ్ను జరుపుకొన్నారు. పెరేడ్ జరుగుతుండగా. రోడ్డుకు ఇరువైపులా నిలబడి త్రివర్ణ పతాకాలు రెపరెపలాడిస్తూ భారీ సంఖ్యలో హాజరయ్యారు. వేలాది మంది ఆడుతూ పాడుతూ డ్రమ్ములు వాయిస్తూ, కొంతమంది అయితే ఢోలక్ లాంటి భారతీయ వాయిద్యాలు కూడా వాయిస్తూ పాల్గొన్నారు.
కాషాయం, తెలుపు, ఆకుపచ్చ వర్ణాలతో గీసిన లైన్లమీద నిలబడిన వేలాది మంది భారతీయ అమెరికన్లు 'అయామ్ అన్నా' అని రాసి ఉన్న టోపీలు ధరించారు. పెరేడ్కు హాజరైన ఒక వ్యక్తి అయితే.. త్రివర్ణ తలపాగా ధరించి, దానిమీద మూడు చిన్న చిన్న పతాకాలు కూడా పెట్టుకున్నాడు.
న్యూయార్క్లోని న్యూ హైడ్ పార్క్ ప్రాంతానికి చెందిన వైష్ణవ్ ఆలయ సభ్యులు 36 మందితో కలిసి ఓ అమెరికన్ జెండా కూడా చేతపట్టుకుని కవాతులో పాల్గొన్నాడు. పెరేడ్లో ఎన్నికైన సభ్యులతో పాటు రాజకీయ పార్టీల అభ్యర్థులు, డెమొక్రాటిక్ పార్టీ అబ్యర్థిని రేష్మా సౌజని, రిపబ్లికన్ మేయర్ అభ్యర్థి జో లోటా తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 10వ తేదీన జరిగే ప్రైమరీలో విజయం కోసం భారతీయుల మద్దతు పొందేందుకు ఇదే సరైన వేదిక అని వారు భావిస్తున్నారు.
తమ మాట ఇప్పుడు మరింత ఎక్కువ మందికి వినిపిస్తుందని భావిస్తున్నట్లు సౌజని తెలిపారు. ఆమె గనక ఈసారి ఎన్నికైతే న్యూయార్క్లో తొలి ఎన్నారై రాజకీయ నాయకురాలు అవుతారు. భారతీయులు బయటకొచ్చి ఏం జరుగుతోందో చూడాలని ఆమె పిలుపునిచ్చారు. న్యూయార్క్ నగరంలోని భిన్నత్వమే ఇక్కడి బలమని లోటా అన్నారు. అమెరికాకు వచ్చిన తామంతా ఇక్కడ పండగ చేసుకుంటున్నామని చెప్పారు. భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్, తమిళ నటుడు శరత్ కుమార్, నటి రాధిక తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజి ప్రారంభ బెల్లును హజారే మోగించనున్నారు.