అన్సారీపై ఆర్ఎస్ఎస్ ధ్వజం
అత్యున్నత పదవిలో ఉంటూ లౌకిక ధర్మాన్ని పాటించాల్సింది పోయి ఫక్తు మత నాయకుడిలా మాట్లాడారంటూ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీపై ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) ధ్వజమెత్తింది. ఇటీవల ఆలిండియా ముస్లిమ్ మజ్లిస్-ఏ-ముషావరత్ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రసంగించిన అన్సారీ భారత్లో ముస్లింలు అణిచివేతకు గురవుతున్నారని వ్యాఖ్యానించడం తెలిసిందే. అన్సారీ అభిప్రాయంతో పూర్తిగా విభేదిస్తూ.. ముస్లింలు ఎదుర్కొంటున్న పరిస్థితులకు వారి అతివాద ధోరణే కారణమని తెలియజెప్పడంలో అన్సారీ విఫలమయ్యారని ఆర్ఎస్ఎస్ తన అధికారిక పత్రిక 'పాంచజన్య'లో పేర్కొంది.
గుర్తింపు, భధ్రత, విద్యావకాశాలు, అభివృద్ధి తదితర విషయాల్లో ముస్లింలు సవాళ్లను ఎదుర్కొంటున్నారంటూ అన్సారీ ఓ మత నాయకుడి మాదిరిగా మాట్లాడారని, అందరి సంక్షేమం గురించి ఆలోచించాల్సిన ఆయన స్థాయికి తగ్గట్లు వ్యవహరించలేదని 'పాంచజన్య' విమర్శించింది. 'ఇస్లాం, నవీన విధానం (మోడర్నిటీ) రైలు పట్టాల్లా ఎప్పటికీ కలవవని ఐఎస్ఐఎస్, తాలిబన్, బొకోహరాం లాంటి ముస్లిం తీవ్రవాద సంస్థలు అంటున్నాయి. ఇస్లాం, మోడర్నిటీలు వేరువేరనే నిజాన్ని అన్సారీ లాంటివాళ్లు చెప్పరు. శతాబ్దాల కిందట ఏర్పరుచుకున్న నియమాలు నూతన విధానాలెలా అవుతాయో ఆయన ఆత్మావలోకనం చేసుకోవాలి' అని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది.
ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఇతర ముస్లిం సంస్థలు భారత్ అనుసరిస్తున్న లౌకిక విధానానికి ఎలా తూట్లు పొడుస్తున్నాయో అన్సారీ గుర్తెరగాలని, రిజర్వేషన్లు, అభివృద్ధి ఫలాలు మతం ఆధారంగా లభించవనే విషయం అర్థం చేసుకుంటే మంచిదని పేర్కొంది. ముస్లింలకు మదర్సాల ఏర్పాటుకు అనుమతులు, హజ్ యాత్రలకు ఆర్థిక సహాయం అందించడాన్ని ఆర్ఎస్ఎస్ ప్రశ్నించింది.