అనూహ్య కేసులో రేపు శిక్ష ఖరారు
సాక్షి, ముంబై: తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో దోషి చంద్రబాన్‌కు శిక్ష ఖరారును ముంబై సెషన్స్ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదావేసింది. దీంతో ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు శుక్రవారం వెలువడే అవకాశముంది. 2014 జనవరి అయిదో తేదీన లోకమాన్య తిలక్ (కుర్లా) టర్మినస్ నుంచి అదృశ్యమైన ఎస్తేర్ అనూహ్య 2014 జనవరి 16వ తేదీన కంజూర్‌మార్గ్ -భాండూప్ మధ్యలో శవమై తేలిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన చంద్రబాన్ సానప్ అలియాస్ లౌక్యాను మంగళవారం కోర్టు దోషిగా నిర్ధారించింది.
దీంతో బుధవారం చంద్రబాన్‌కు కోర్టు శిక్ష ఖరారు చేస్తుందని భావించారు. అయితే ఈ కేసుకు సంబంధించి సెషన్స్‌కోర్టులో బుధవారం ఉదయం సుమారు 11.30 గంటల నుంచి ఇరు పక్షాల తుది వాదనలు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రభుత్వ న్యాయవాది రాజన్ ఠాక్రే తన వాదనను విన్పించారు. అనూహ్య హత్య కేసులో దోషిగా నిర్ధారణ అయిన చంద్రబాన్‌కు మరణశిక్ష విధించాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాన్ ఉద్దేశపూర్వకంగానే క్రూరంగా అనూహ్యను హత్య చేసినట్టు పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో గతంలో హైకోర్టులతోపాటు సుప్రీం కోర్టు మరణశిక్షలు విధించినట్టు తెలిపారు. అయితే నిందితుడు తన తప్పు తెలుసుకుని మారాలనుకుంటున్నాడని, శిక్ష తగ్గించాలని డిఫెన్స్ న్యాయవాది ప్రకాష్ సలసింగ్కర్ వాదించారు.
ఇరు పక్షాల వాదనలను విన్న అనంతరం సెషన్‌కోర్టు న్యాయమూర్తి వీవీ జోషి 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం అనూహ్య బంధువైన అరుణ్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ఇంత త్వరగా కోర్టు నిందితున్ని దోషిగా ప్రకటిస్తూ తీర్పునివ్వడం ఆనందం కలిగించిందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దోషికి మరణశిక్ష విధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.