సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని బొటానికల్‌గార్డెన్ వద్ద రెండు గోనె సంచుల్లో ఏడు ముక్కలుగా దొరికిన బింగి దారుణహత్య కేసులో కూకట్‌పల్లి సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. నలుగురిని దోషులుగా తేలుస్తూ వారు బతికి ఉన్నతంకాలం జైల్లోనే ఉండేలా జీవితఖైదు విధించింది. బిహార్‌లోని బాంకా జిల్లా మోహన్‌మల్టీ గ్రామానికి చెందిన బింగి అలియాస్ పింకి అలియాస్ శాలినిది నిరుపేద కుటుంబం. రాజస్తాన్‌లో ఓ ఇటుకల పరిశ్రమలో పనిచేసే ఈమె తండ్రి దబ్బోలెయ్యా ఏడాదికి ఓసారి మాత్రమే సొంతూరుకు వచ్చి వెళ్లేవాడు.
2005లో ఉత్తరప్రదేశ్‌లోని సన్బల్ జిల్లా చాందూసిటౌన్‌కు చెందిన దినేష్ తో బింగి వివాహం జరగ్గా, వీరికి ముగ్గురు సంతానం. భర్తతో విభేదాలు ఏర్పడిన తర్వాత బింగికి చాందూసి ప్రాంతానికే చెందిన వికాస్ కశ్యప్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వికాస్‌తోపాటు ఒక కుమారుడిని తీసుకొని బింగి 2017లో సొంతూరుకు వెళ్లింది. ఈ క్రమంలోనే అక్కడ వికాస్‌కు మరో మహిళ మమత ఝాతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. దీంతో బింగిని వికాస్‌ను వదిలిపెట్టాడు.
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వికాస్, భర్త అనిల్ ఝాలతో కలిసి మమత హైదరాబాద్‌కు వచ్చింది. అప్పటికే మమత ఝా కుమారుడు అమర్‌కాంత్ ఝా నగరంలోని దలాల్ స్ట్రీట్ బార్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. వీరంతా కలిసి సిద్ధిఖీనగర్‌లోని ఓ ఇంట్లో దిగారు. వికాస్, మమత సిద్ధిఖీనగర్‌లోనే చాట్‌బండార్ నిర్వహించేవారు.
హైదరాబాద్‌కు వచ్చి హతం: అతికష్టం మీద వికాస్ చిరు
నామా తెలుసుకొని బింగి వీరి వద్దకు చేరుకుంది. అప్పటి నుంచి వికాస్, మమత మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పటికే బింగి 8 నెలల గర్భిణి. ఆమెను ఆస్పత్రికి తీసు కెళితే ఖర్చు అవుతుందని, బిడ్డ పుడితే వికాస్ డబ్బులన్నీ వారికే ఖర్చుపెట్టాల్సి వస్తుందని భావించిన మమత ఆమె హత్యకు పథకం వేసింది.
దీనికి వికాస్ సహా మిగిలిన వారూ సహకరించడానికి అంగీకరించారు. 2018 జనవరి 27 రాత్రి 12 గంటల ప్రాంతంలో మమత, వికాస్‌లు బింగితో గొడవపడ్డారు. ఈ క్రమంలో మమత బింగి మెడ పట్టుకుని బలంగా గోడవైపు తోసింది. దీంతో బింగి కుప్పకూలిపోగా మమత, వికాస్ ఆమె నోరు, కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకున్నారు. మమతతోపాటు ఆమె భర్త అనిల్ ఝా, కుమారుడు అమర్‌కాంత్ ఝా బింగి శరీరంపై ఇష్టమొచి్చనట్టు పిడిగుద్దులు కురిపించారు. దీంతో బింగి చనిపోయింది.
మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి....
బింగి మృతదేహాన్ని ఒకరోజంతా బాత్‌రూమ్‌లోనే ఉంచారు. మర్నాడు అమర్‌కాంత్ ఎలక్ట్రికల్ కటింగ్ మెషీన్, రెండు గోనె సంచులు తీసుకొచ్చాడు. మెషీన్‌తో బింగి తల, మొండెం, కాళ్లు, చేతులు ముక్కలుగా చేసి రెండు గోనె సంచుల్లో ప్యాక్ చేశారు. అమర్‌కాంత్ తాను పనిచేస్తున్న బార్‌లో ఫ్లోర్ మేనేజర్, ఒడిశావాసి అయిన సిద్ధార్థ బర్దన్‌కు చెందిన బైక్ తీసుకొచ్చాడు. మమత సాయంతో గోనె సంచుల్నీ తీసుకువెళ్లి బొటానికల్ గార్డెన్ వద్ద పడే శారు. దీనిపై జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికుల ద్వారా సమాచారం అందుకున్న గచ్చి»ౌలి పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ లో నీలిరంగు చొక్కా ధరించి.. ముఖానికి కళ్లద్దాలు పెట్టుకున్న వ్యక్తి, గోనెసంచులతో మహిళ వెనుక కూర్చు న్న దృశ్యాలు కనబడ్డాయి. నిందితులు వినియోగించిన ఆ బైక్ బౌద్దనగర్‌కు చెందిన విజయ్‌కుమార్ బాద్రే పేరు మీద ఉంది. అతడి నుంచి 2009లో శశికుమార్‌గౌడ్ వద్దకు చివరకు సిద్ధార్థ బర్దన్ చేతికి వచ్చింది. ఇతడు హఫీజ్‌నగర్‌లో రాంగ్‌రూట్‌లో వెళుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ఆ సమయంలో విధించిన ‘స్పాట్ పేమెంట్ చలాన్’ద్వారా అతడి ఫోన్ నంబరు తెలిసింది. అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, అమర్‌కాంత్, మమత, వికాస్, అనిల్ పేర్లు వెలుగులోకి వచ్చి కేసు ఓ కొలిక్కి వచ్చింది.
13 రోజుల్లోనే పోలీసులు ఈ కేసులో నిందితులను అరెస్టు చేశారు. ఆ తర్వాతే హతురాలు బింగి అని తేలింది. కేసు దర్యాప్తు చేసిన గచ్చిబౌలి పోలీసులు నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేశారు. కేసు విచారించిన కూకట్‌పల్లిలోని ఆరో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ కోర్టు దోషులుగా తేలిన నలుగురూ బతికి ఉన్నంత కాలం జైల్లోనే ఉండేలా శిక్ష విధించింది. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఇన్‌స్పెక్టర్ ఎం.గంగాధర్ (ప్రస్తుతం ఏసీపీ) దాఖలు చేసిన చార్జ్‌షీట్ పోలీసు అకాడమీలో ఓ సబ్జెక్ట్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment