నివేదిక అంతా గందరగోళం!
రవాణా శాఖ వైఫల్యాల్ని కప్పి పుచ్చుకునేందుకేనని అనుమానాలు
⇒ ప్రైవేటు ట్రావెల్స్ తనిఖీలను పట్టించుకోని యంత్రాంగం
⇒ ముండ్లపాడు బస్సు ప్రమాద ఘటన విచారణపై నోరెత్తని సర్కారు
⇒ ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రాణ నష్టం లేని బస్సు ప్రమాదాలపై విచారణకు ఆదేశం
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా ముండ్లపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 10 మంది మృత్యువాత పడిన ఘటనలో రవాణా శాఖ సర్కారుకు ఇచ్చిన నివేదిక గందరగోళంగా ఉంది. రవాణా శాఖ వైఫల్యాల్ని కప్పి పుచ్చుకునే క్రమంలో బస్సు బోల్తా నివేదికను ఉద్ధేశపూర్వకంగానే గందరగోళంగా మార్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్సు ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు డ్రైవర్లు బస్సులోనే ఉన్నారని, మృతి చెందిన డ్రైవరు తాడిపత్రికి చెందిన ఆదినారాయణ కాగా, రెండో డ్రైవరు కోదాడకు చెందిన శేఖర్ రెడ్డి. కానీ శేఖర్ రెడ్డి బస్సు డిక్కీలోనే నిద్రిస్తున్నారని, సంఘటన జరిగిన తర్వాత స్వల్ప గాయాలతో బయటకు వచ్చారని రవాణా శాఖ సర్కారుకు నివేదిక అందించింది.
సాధారణంగా బస్సు నడిపే సమయంలో ఇద్దరు డ్రైవర్లు క్యాబిన్‌లోనే ఉంటారు. డిక్కీలో నిద్రిస్తున్నారనే రవాణా శాఖ నివేదికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగిన రెండు గంటల తర్వాత శేఖర్ రెడ్డి గాయాలతో డిక్కీనుంచి బయటకు వచ్చారని రవాణా శాఖ నివేదికలో పేర్కొంది. ప్రమాదం జరిగిన ముండ్లపాడు ప్రాంతం కోదాడకు దగ్గర్లో ఉండటంతో అసలు రెండో డ్రైవరు బస్సులో ఉన్నాడా? లేడా? అన్న అనుమానాలు వ్యక్తం కావడం గమనార్హం. ప్రమాదానికి గురైన దివాకర్ ట్రావెల్స్ బస్సుకు ఆలిండియా టూరిస్ట్ పర్మిట్ ఉందని పేర్కొంటూనే కాంట్రాక్టు క్యారేజీ అనుమతి ఉందని గందరగోళంగా నివేదిక ఇచ్చారు.
విచారణపై నోరు మెదపని సర్కార్...
బస్సు ప్రమాదంలో 10 మంది మృతి చెందినా ఇంతవరకు న్యాయ విచారణ కానీ.. శాఖాపరమైన విచారణకు ఆదేశించిక పోవడాన్ని బట్టి చూస్తే అధికార పార్టీ ఎంపీ, అతని సోదరుడిని పూర్తిగా కాపాడేందుకేనన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. గురువారం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బస్సు బోల్తా పడిన ఘటనలు జరిగాయి. ఈ రెండు ఘటనల్లో ప్రాణ నష్టం లేకపోయినా.. పలువురికి గాయాలయ్యాయి. వెంటనే ప్రభుత్వం ఈ రెండు సంఘటనలపై విచారణకు ఆదేశించింది. ఈ ట్రావెల్స్‌తో తమ పార్టీ వారెవరికీ సంబంధాలు లేవు కాబట్టే, పైగా చిన్న ట్రావెల్స్ కావడంతో విచారణ పేరుతో హడావుడి చేసింది.
కానీ 10 మంది మరణించిన ముండ్లపాడు ఘటనపై నివేదికలతో సరిపెట్టడం గమనార్హం. బస్సు ప్రమాదంపై ఇంకా లోతైన విచారణ జరగాలనుకున్నా.. రోడ్డు నిర్మాణంలోనూ సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయేమో కూడా పరిశీలన జరిపించాలి. ప్రమాదం జరిగిన ప్రాంతం జాతీయ రహదారి కావడంతో ఎన్‌హెచ్‌ఏఐను నివేదిక కోరాలి. ప్రమాదం జరిగిన ప్రదేశం హైదరాబాద్ ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలో ఉంది. పైపెచ్చు రోడ్డు నిర్వహణ జీఎంఆర్ సంస్థ నిర్వహిస్తుండటం విశేషం.
బస్సుల తనిఖీల్లో రవాణా శాఖ వైఫల్యం...
ఆలిండియా టూరిస్ట్ పర్మిట్లు పొందిన ప్రైవేటు బస్సులు స్టేజి క్యారియర్లుగా తిప్పుతూ ప్రయాణీకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ముండ్లపాడు ఘటనతో పొరుగునున్న తెలంగాణ ప్రభుత్వం తమ సరిహద్దుల్లో తిరుగుతున్న ఏపీ ట్రావెల్స్ తనిఖీలు చేపట్టింది. ఏపీలోని ప్రైవేటు ట్రావెల్స్‌పై ఉక్కుపాదం మోపింది. పలు బస్సులకు సరైన పత్రాలు లేవని కేసులు నమోదు చేసింది. కానీ ఏపీ రవాణా శాఖ అధికారులు కనీసం తనిఖీలు కూడా చేయకపోవడాన్ని బట్టి చూస్తే ప్రైవేటు ట్రావెల్స్ మాఫియాతో సర్కారు పెద్దలు ఎంత అంటకాగుతున్నారో.. ఇట్టే అర్ధమవుతుంది.
ప్రైవేటు ట్రావెల్స్‌ను తనిఖీ చేయడానికి రవాణా అధికారులు వెనుకాడుతున్నారంటే ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా సర్కారును ఎంతలా గుప్పిట్లో పెట్టుకున్నారో.. తెలుస్తుంది. రవాణా శాఖ అధికారులు జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లో బస్సుల వేగ పరిమితి, బ్రీత్ ఎనలైజర్లతో పరీక్షలు నిర్వహించాలి. విధిగా ప్రతి రోజూ టోల్‌గేట్లు దాటే బస్సుల వివరాలు నమోదు చేయాలి. కానీ సిబ్బంది కొరత, పరీక్షలకు సరైన పరికరాలు (బ్రీత్ ఎనలైజర్లు, స్పీడ్ గన్‌లు) లేకపోవడం వల్లే తనిఖీలు చేయలేకపోతున్నామని సాక్షాత్తూ రవాణా శాఖ అధికారులే వెల్లడించడం గమనార్హం. తనిఖీల్లో రవాణా శాఖ డొల్లతనం వెల్లడవుతుందనే కారణంతో బస్సు ప్రమాద దుర్ఘటనపై గందరగోళ నివేదిక అందించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.