దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించే జెండా వందనం కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో చిచ్చు రాజేసింది.
విజయవాడ: దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించే జెండా వందనం కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో చిచ్చు రాజేసింది. సోమవారం నిర్వహించే జెండా వందనం విషయంలో తమకు తగిన గౌరవం ఇవ్వడం లేదని సీనియర్ మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పంద్రాగస్టు సందర్భంగా ఆయా జిల్లా కేంద్రాల్లో జిల్లాకు చెందిన మంత్రులు జెండా ఆవిష్కరణ చేపడుతుంటారు. అయితే, ఈ విషయంలో జిల్లా మంత్రులను పట్టించుకోకపోవడం వారిలో అసంతృప్తిని రాజేస్తోంది.
విశాఖపట్నంలో మంత్రి యనమల రామకృష్ణుడు జెండా ఎగురవేయబోతున్నారు. అయితే, ఇక్కడ తనకు అవకాశం ఇవ్వకపోవడంపై మంత్రి అయ్యన్నపాత్రుడు కినుక వహించినట్టు తెలుస్తోంది. ఇక ప్రకాశం జిల్లాలో ఉన్న ఏకైక మంత్రి సిద్ధా రాఘవరావుకు చివరినిమిషంలో అవకాశం కల్పించారు. మొదట ప్రకాశంలో జరిగే జెండావందనంలో మంత్రి రావెల కిషోర్‌బాబుకు అవకాశం కల్పించగా.. దీనిపై సిద్ధా రాఘవరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో చివరినిమిషంలో ఆయనకు చాన్స్ ఇచ్చారు.
నెల్లూరు జిల్లాలో జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి నారాయణ జెండావందనంలో పాల్గొంటారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో దళిత మంత్రి పీతల సుజాతకు అవకాశం దక్కలేదు. ఈ జిల్లాలో మంత్రి మణిక్యాల రావు జెండా ఎగురవేయబోతుండటంతో మంత్రి పీతల సుజాత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.