
అపోలో ఆసుపత్రుల్లో అత్యాధునిక టెక్నాలజీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆరోగ్యసేవల రంగంలో ప్రపంచంలో అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తాము వినియోగిస్తున్నట్టు అపోలో హాస్పిటల్స్ తెలిపింది. నూతన పరిజ్ఞానాన్ని కొనుగోలు చేయడం, ప్రస్తుతమున్నవాటి స్థాయి పెంచడానికి ఏటా రూ.30 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నట్టు సంస్థ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఆసుపత్రిని ప్రారంభించి 25 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా సోమవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో తొలి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇదేనని చెప్పారు. 120 దేశాల నుంచి రోగులు వైద్యం కోసం అపోలోకు వస్తున్నారని వెల్లడించారు. ‘ఆసుపత్రి ప్రారంభించిన తొలినాళ్లలో గుండె శస్త్ర చికిత్సకు 3 వేల డాలర్లు చార్జీ చేసేవాళ్లం. ఇప్పుడు 2,700 డాలర్లు తీసుకుంటున్నాం. అమెరికాలో అయితే 65-75 వేల డాలర్లు వ్యయం అవుతుంది’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది గుండె, కాలేయం, మూత్ర పిండాల మార్పిడి ఆపరేషన్లు అత్యధికంగా నిర్వహించింది అపోలో అని చెప్పారు. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు అమెరికాలో 10 లక్షల డాలర్లుందని, తాము రూ.30 లక్షలకు నిర్వహిస్తున్నామని వివరించారు.
భారీ విస్తరణ: అపోలో హాస్పిటల్స్ ప్రస్తుతం 59 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. వీటన్నిటి పడకల సామర్థ్యం 8,700. వచ్చే మార్చినాటికి పడకల సంఖ్యను 10 వేలకు చేర్చనుంది. ఏడు దేశాలకు అపోలో తన వైద్య సేవలను విస్తరించింది. దశల వారీగా మరిన్ని దేశాల్లో అడుగుపెట్టనుంది. మొబైల్ ఫోన్ ద్వారా వైద్య సేవలందించే ప్రాజెక్టు డిసెంబరులోగా ప్రారంభించనుంది. ఇది కార్యరూపం దాలిస్తే ప్రపంచంలో ఏ మూలనున్నా రోగులను చేరుకోవచ్చని అపోలో విశ్వసిస్తోంది. తమ ఆసుపత్రుల్లో ఇప్పటివరకు 3.5 కోట్ల మంది వైద్య సేవలు పొందినట్టు అపోలో తెలిపింది. కాగా, హీలర్: డాక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డి, ద ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ఇండియా పేరుతో ప్రతాప్‌రెడ్డి జీవిత చరిత్రను ప్రముఖ రచయిత, కాలమిస్టు ప్రణయ్ గుప్తే రాస్తున్నారు. కొద్ది రోజుల్లో ఇది మార్కెట్లోకి రానుంది.