
దరఖాస్తుల నుంచే 154.94 కోట్లు
* రెండేళ్ల మద్యం పాలసీకి అనూహ్య స్పందన
* మొత్తం షాపులు 2,216.. దరఖాస్తులు 30,987
* ఒక్క దరఖాస్తూ రాని దుకాణాలు 105
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండేళ్ల మద్యం విధానానికి భారీగా స్పందన వచ్చింది. మద్యం దుకాణాల కోసం వ్యాపారులు పెద్దఎత్తున పోటీపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మద్యం దుకాణాల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని మొత్తం 2,216 మద్యం షాపులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయగా...
2,111 దుకాణాలకు 30,987 దరఖాస్తులు దాఖలయ్యాయి. హైదరాబాద్‌తో పాటు ఆరు జిల్లాల్లోని 105 దుకాణాల లెసైన్సుల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు. ఇక దరఖాస్తు ఫీజుల ద్వారా ఎక్సైజ్ శాఖకు రికార్డు స్థాయిలో రూ.154.94 కోట్ల ఆదాయం లభించింది. గత ఏడాది వచ్చిన రూ.53.56 కోట్లతో పోలిస్తే ఇది మూడింతలు కావడం గమనార్హం. మద్యం దుకాణాల కోసం ఖమ్మం జిల్లాలో వ్యాపారులు భారీగా పోటీపడ్డారు. ఈ జిల్లాలోని 148 దుకాణాలకోసం ఏకంగా 6,615 దరఖాస్తులు రావడం గమనార్హం. ఇక్కడ దరఖాస్తు ఫీజుతోనే ఎక్సైజ్ శాఖకు రూ.33.07 కోట్లు సమకూరాయి. ఇక అనేక జిల్లాల్లో మహిళల పేరుతో వందలాది దరఖాస్తులు దాఖలు కావడం గమనార్హం.
జీహెచ్‌ఎంసీలో స్పందన అంతంతే!
మద్యం దుకాణాలకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్దగా స్పందన రాలేదు. ఇక్కడ ఏడాదికి లెసైన్సు ఫీజు రూ.1.08 కోట్లుగా నిర్ణయించిన నేపథ్యంలో వ్యాపారులు ఆసక్తి చూపలేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 503 దుకాణాలకుగాను 95 దుకాణాలకు దరఖాస్తులే రాలేదు. ఇందులో హైదరాబాద్ జిల్లా పరిధిలోని 212 మద్యం దుకాణాలకుగాను 160 షాపులకు 316 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 52 దుకాణాల కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. అలాగే రంగారెడ్డి జిల్లాలో 390 దుకాణాలకు గాను 32 ఔట్‌లెట్ల కోసం దరఖాస్తులు రాలేదు.
ఇవన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోవే. మెదక్ జిల్లాలోని పటాన్‌చెరు, రామచంద్రాపురం పరిధిలోని 11 దుకాణాల నిర్వహణకు ఎవరూ ముందుకు రాలేదు. ఇవికాకుండా నిజామాబాద్‌లో 5, వరంగల్‌లో మూడు, ఆదిలాబాద్ జిల్లాలో రెండు దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. అయితే 2014-15 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 107 దుకాణాలకు లెసైన్సులు జారీకాలేదు.ఆఖరి రోజు 16 వేలు
దరఖాస్తులకు వారం గడువు ఇచ్చినా... చివరి రోజునే భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం దరఖాస్తుల్లో సగానికి పైగా అంటే 16,111 దరఖాస్తులు సోమవారమే వచ్చాయి. తద్వారా రూ.80.56 కోట్ల ఆదాయం ఒక్కరోజే సమకూరింది. మంగళవారం ఉదయం వరకు అధికారులు ఈ దరఖాస్తులను పరిశీలించి లెక్క తేల్చారు. కాగా, 23న అన్ని జిల్లాల్లో కలెక్టర్ల సమక్షంలో డ్రా తీసి లెసైన్సులు జారీ చేస్తామని, 105 దుకాణాలకు దరఖాస్తులు రాలేదని, వీటికి మళ్లీ నోటిఫికేషన్ జారీచేస్తామని, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ చెప్పారు. ఎవరూ ముందుకు రాకపోతే టీఎస్‌బీసీఎల్ ద్వారా దుకాణాలను నిర్వహిస్తామన్నారు.