
రాత్రంతా చలిలో కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఒక ముఖ్యమంత్రి.. నడి రోడ్డుపై ధర్నాకు దిగడమే ఒక వింత అయితే.. ఆయన తన నిరసనను కొనసాగించడంలో భాగంగా సోమవారం రాత్రంతా రోడ్డుపక్కనే పడుకున్నారు. విజయ్ చౌక్-రైల్ భవన్‌కు మధ్యలో ఉన్న ధర్నా ప్రాంతానికి దగ్గరలోనే తన వ్యాగన్-ఆర్ కారు ఉన్నప్పటికీ కూడా ఆయన రోడ్డుపక్కనే నిద్రించారు.
ప్రస్తుతం ఢిల్లీలో చలికి మనుషులు చనిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. ఆయన సోమవారమంతా తీవ్రంగా దగ్గుతూ కనిపించారు. 11.30 గంటల ప్రాంతంలో నిద్రకు ఉపక్రమించిన ఆయన.. చలికి తట్టుకోలేక ఒక పరుపును, ఏడు దుప్పట్లను కప్పుకొన్నారు.
కేజ్రీవాల్ మధుమేహ వ్యాధిగ్రస్తుడు కావడంతో వ్యక్తిగత వైద్యులు మధ్యలో పలుమార్లు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ఆయన నిద్రకు భంగం కలగకుండా ఉండడానికి ‘ఆప్’ కార్యకర్తలు వంతుల వారీగా రాత్రంగా కాపలా కాశారు. ఫొటోలు తీయడానికి యత్నించిన ఫొటో గ్రాఫర్లను కూడా ఆయన దరికి రానివ్వలేదు.
కేజ్రీవాల్ ఇలా రోడ్డుపై పడుకోగా.. ఆయన కేబినెట్‌లోని పర్యావరణ మంత్రి సౌరవ్ భరద్వాజ్ మాత్రం సమీపంలోని తన కారులో నిద్రించారు.
రాత్రి 1.12 గంటల ప్రాంతంలో ఒకసారి లేచిన కేజ్రీవాల్.. తనపై దుప్పట్లను తొలగించాల్సిందిగా వాలంటీర్లకు సూచించారు. వందల మంది ‘ఆప్’ వాలంటీర్లు.. రాత్రంతా దేశభక్తి పాటలు పాడుతూ, నినాదాలు చేస్తూ ఉన్నారు.
ఉదయం 5.20 గంటలకు లేచీ లేవగానే కేజ్రివాల్.. హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేపై మండిపడ్డారు. ‘‘ఢిల్లీలో ఎన్నో నేరాలు జరుగుతూ ఉంటే.. హోం మంత్రికి నిద్ర ఎలా పడుతోంది? ఆయనేమైనా నియంతనా? మేం ఆయనతో చర్చలు జరపం.. ఇదేమీ కిరాణా కొట్టు కాదు’’ అని మండిపడ్డారు.
మహిళల టాయ్‌లెట్లో మంత్రి సోమనాథ్
దేశవ్యాప్తంగా చాలా మంది ఎదుర్కొంటున్న టాయ్‌లెట్ సమస్య.. ధర్నాలో ఉన్న కేజ్రీవాల్ కేబినెట్‌కు కూడా ఎదురైంది. ధర్నా ప్రాంతానికి సమీపంలోని టాయ్‌లెట్లన్నింటినీ కేంద్రం మూసేయడంతో మంత్రి సోమనాథ్ భారతి మంగళవారం సమీప ప్రెస్ క్లబ్‌లోని మహిళల టాయ్‌లెట్‌నే వినియోగించారు. పక్కనే పురుషుల సౌచాలయం ఉన్నప్పటికీ.. కేంద్రంపై తన నిరసన తెలియజేయడానికి ఆయన అందులోకి వెళ్లలేదు. దీంతో ఆయన బయటకు వచ్చే వరకు మహిళా రిపోర్టర్లు.. వేచి ఉండాల్సి వచ్చింది.
కేజ్రీవాల్ మంగళవారం ఉదయం నిద్రలేచి మీడియాతో మాట్లాడాక 6 గంటల ప్రాంతంలో ఆయన కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం సమీప ప్రెస్‌క్లబ్‌లోని టాయ్‌లెట్‌నే ఉపయోగించుకోవాల్సి వచ్చింది.
తనకు జెడ్ కేటగిరీ భద్రత వద్దని కేజ్రీవాల్ తిరస్కరించినప్పటికీ.. ధర్నా సందర్భంగా మాత్రం ఆయన కాదన్నా పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
సరైన సమయంలో సరైన నిర్ణయం: కాంగ్రెస్
ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ తెలిపింది. కేజ్రీవాల్ ప్రభుత్వ అరాచక వైఖరితో తమ ఓపిక నసిస్తోందని కాంగ్రెస్ ప్రతినిధి రందీప్ సూరజ్‌వాలా వ్యాఖ్యానించారు. ఆప్ ప్రవర్తనపై తాము అసంతృప్తితో ఉన్నట్లు చెప్పారు.