
కేజ్రీవాల్‌కు తెలీకుండానే భద్రత కల్పించాం: షిండే
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఆయనకు తెలియకుండానే పటిష్టమైన భద్రత కల్పించినట్టు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. తనకు భద్రత అవసరం లేదని కేజ్రీవాల్ పదేపదే చెబుతున్నప్పటికీ సీఎంగా ఎన్నికైన వ్యక్తి వీవీఐపీ పరిధిలోకి వస్తారని, అలాంటి వారికి భద్రత కల్పించాల్సిన అవసరం అటు రాష్ట్రాలు, ఇటు కేంద్రంపై ఉంటుందని షిండే పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సంబంధిత అధికారులు కేజ్రీవాల్‌కు భద్రత కల్పిస్తామని ఇప్పటికే మూడుసార్లు ప్రతిపాదించారని, అయినప్పటికీ ఆయన నిరాకరించడంతో తామే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కాగా, ఘజియాబాద్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో తనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తామన్న పోలీసుల ప్రతిపాదనను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి నిర్ద్వంద్వంగా తిప్పికొట్టారు. ‘నాప్రాణాలకు ముప్పులేదు. నాకెలాంటి భద్రతా అవసరం లేదు’ అని పేర్కొన్నారు.
సభ్యత్వానికి భారీ స్పందన: ‘మై భీ ఆమ్ ఆద్మీ’ పేరిట జాతీయ స్థాయిలో శుక్రవారం కేజ్రీవాల్ ప్రారంభించిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోందని ఆప్ మీడియా టీం వెల్లడించింది. కేవలం 3గంటల్లోనే 47,500 మంది ఇంటర్నె ట్ ద్వారా, 1950 మంది ఎంఎంఎస్, మిస్డ్‌కాల్స్ ద్వారా సభ్యత్వం స్వీకరించినట్టు టీం తెలిపింది. సభ్యత్వ నమోదుకు 07798220033లో సంప్రదించవచ్చని పేర్కొంది.