అధికారంలోకి రాకముందు.. ప్రతిపక్షంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై హడావుడి చేసిన బీజేపీ ఇప్పుడు మాట మార్చింది.
తాజాగా తెరపైకి ఆర్థిక సాయం!
సాక్షి, న్యూఢిల్లీ: అధికారంలోకి రాకముందు.. ప్రతిపక్షంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై హడావుడి చేసిన బీజేపీ ఇప్పుడు మాట మార్చింది. పరోక్షంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు సాధ్యం కాదని తేల్చిచెబుతోంది. చట్టబద్ధమైన హామీలు నెరవేరుస్తామని, ఆర్థికసాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్న బీజేపీ ఎప్పుడు ఏ విధంగా మాట్లాడిందో ఒకసారి పరిశీలిస్తే..
అప్పుడు..: ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై రాజ్యసభలో మాట్లాడిన అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్.. ‘13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా వర్తింపజేస్తాం..’ అని ప్రకటించారు. వెంటనే బీజేపీ సభ్యులు ఎం.వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఐదేళ్లపాటు ఇస్తే సరిపోదని, పదేళ్ల పాటు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు తాము తప్పకుండా అధికారంలోకి వస్తామని, ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్ల పాటు వర్తింపజేస్తామని చెప్పారు.
మరిప్పుడు..: తాజాగా కేంద్రం.. 14వ ఆర్థిక సంఘం నివేదికను ప్రస్తావిస్తూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమనే సంకేతాలిచ్చింది. ఇటీవల ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్‌సింగ్ పార్లమెంటులో మాట్లాడుతూ కొత్తగా ఇక ప్రత్యేక హోదా ప్రశ్నే తలెత్తదని స్పష్టం చేశారు.