అమ్మాయిల పరుగుపై నిషేధం
మెల్బోర్న్: ఆధునిక కాలంలోనూ విద్యాసంస్థలకు కూడా మూడనమ్మకమత మౌఢ్యాలు తప్పడం లేదు. ఆస్ట్రేలియాలోని ఓ ఇస్లామిక్ కాలేజీలో అమ్మాయిలకు పరుగు పోటీలను నిషేధించారు. వారు కన్యత్వాన్ని కోల్పోతారని ఉద్దేశంతోనే ఆ పని చేసినట్లు ఏకంగా ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఈ పని చేశాడు. దీంతో ఇప్పుడతనిపై కేసు నమోదైంది. ట్రుగానినా సూబర్బ్లోని అల్ తఖ్వా అనే కాలేజీలో ఉన్నపలంగా అమ్మాయిలెవరూ ఆటల్లో పాల్గొనవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి.
దీంతో అదే కళశాలలో గతంలో పనిచేసిన ఓ ఉపాధ్యాయుడు విక్టోరియన్ రిజిస్ట్రేషన్ అండ్ క్వాలిఫికేషన్స్ అథారిటీ (వీఆర్ క్యూఏ)కి ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. ప్రిన్సిపాల్ అమ్మాయిల విషయంలో వివక్ష చూపుతున్నాడని, వారిని తప్పుడు ఉద్దేశాలతో ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో విచారణ చేపట్టిన అథారిటీ అసలు విషయం రాబట్టింది.
కళశాల ప్రిన్సిపాల్ ఒమర్ హల్లాక్ మూఢ మత విశ్వాసాలకు బద్ధుడై ఉండి అమ్మాయిలు పరుగెత్తితే వారి కన్యత్వాన్ని కోల్పోతారని, సాకర్ వంటి ఆటలు ఆడటం వల్ల సంతాన లేమి సమస్యలు కూడా వస్తాయని భావించి వారిని ఆటల్లో పాల్గొనకుండా నిషేధం విధించాడని తెలిసింది. దీంతో అతడిని నిందితుడిగా చేర్చారు.