జర్మనీలోని బవేరియాలో ఆటోమొబైల్స్ పరిశ్రమల్నే కాదు.. బయోటెక్నాలజీ, అగ్రి, ఎడ్యుకేషన్, మెడికల్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జర్మనీలోని బవేరియాలో ఆటోమొబైల్స్ పరిశ్రమల్నే కాదు.. బయోటెక్నాలజీ, అగ్రి, ఎడ్యుకేషన్, మెడికల్.. ఇలా అన్ని రంగాలను ప్రోత్సహించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా 19 రకాల క్లస్టర్స్‌ను ఏర్పాటు చేసింది. స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు గాను వంద బిలియన్ యూరోలతో ఇంక్యుబేషన్ సెంటర్‌ను నెలకొల్పామని స్టేట్ ఆఫ్ బవేరియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జాన్ కోటాయిల్ పేర్కొన్నారు. ఇందులో 50కి పైగా టెక్నాలజీ ఆధారిత కంపెనీలు సేవలను అందిస్తున్నాయని, వీటిని వినియోగించుకోవాలని ఇక్కడి వ్యాపారవేత్తలను ఆయన కోరారు.
కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో ‘బవేరియాలో వ్యాపార అవకాశాలు’ అనే అంశంపై గురువారమిక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ప్రీమియం కార్లున్నా.. అందులో ఎక్కువ శాతం దిగుమతి అవుతుంది జర్మనీ నుంచేనని చెప్పారు. ప్రత్యేకించి హైదరాబాద్‌లో నడుపుతున్న ప్రతి ప్రీమియం వెహికిల్ అక్కడి నుంచి దిగుమతి చేసుకున్నదేనని చెప్పారు. ఎగుమతుల రంగంలో ఎలక్ట్రానిక్స్ రంగం 27.6 శాతం వాటాను కలిగి ఉందన్నారు.
అడిడాస్, సిమన్స్, బీఎండబ్ల్యూ, ఎంటీయూ, అలియంజ్, ఆడి వంటి ప్రపంచంలో ఉన్న అతిపెద్ద కంపెనీల్లో 20 శాతం సంస్థలు జర్మనీలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో డాక్టర్ రెడ్డిస్, టాటా, ఎల్‌అండ్‌టీ, విప్రో వంటి సుమారు 17 భారతీయ కంపెనీలూ ఉన్నాయన్నారు. గతేడాది బవేరియా నుంచి మన దేశానికి 1,379 బిలియన్ యూరోల దిగుమతులు జరగగా,. మన దేశం నుంచి బవేరియాకు 943 బిలియన్ యూరోల ఎగుమతులు జరిగాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐఐ తెలంగాణ చైర్‌పర్సన్ వనితా దాట్ల, స్టేట్ ఆఫ్ బవేరియా (ఇండియా ఆఫీస్) సీనియర్ అడ్వైజర్ టీ సంపత్ కుమార్ పాల్గొన్నారు.