పెద్దనోట్ల రద్దు విషయంలో పొరపాటు అదే..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేశాక ప్రజలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో వధూవరుల కుటుంబ సభ్యులు కరెన్సీ కోసం ఇబ్బంది పడుతున్నారు. యోగాగురు బాబా రాందేవ్ ఈ విషయంపై స్పందిస్తూ.. 'బీజేపీలో చాలామంది అవివాహితులున్నారు. ఇది పెళ్లిళ్ల సీజన్ అని వారు తెలుసుకోలేకపోయారు. పొరపాటు అదే' అని చమత్కరించారు. పెద్దనోట్లను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం 15 రోజులు లేదా నెల తర్వాత తీసుకుని ఉంటే పెళ్లిళ్లపై ప్రభావం పడేదికాదని అన్నారు.
పెద్ద నోట్ల రద్దు వల్ల కట్నం తీసుకోవడం పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులకు సమస్యగా మారిందని రాందేవ్ చెప్పారు. ఇదీ ఓ మంచి పరిణామమని, కట్నం ఇవ్వాలని డిమాండ్ చేయలేరని అన్నారు. కాగా ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని వివాహాలు చేస్తున్న కుటుంబ సభ్యులకు ఒకేసారి 2.5 లక్షల రూపాయల వరకు విత్ డ్రా చేసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది.