
న్యాయ నిపుణులతో బాబు మంతనాలు
ఓటుకు కోట్లు కేసు విచారణను వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాలని ఏసీబీని ప్రత్యేక కోర్టు ఆదేశించటంతో చంద్రబాబు ఖంగుతిన్నారు.
- కోర్టు ఉత్తర్వులతో కంగుతిన్న టీడీపీ అధినేత
- చిత్తూరు పర్యటన అర్థాంతరంగా ముగించుకుని విజయవాడకు
సాక్షి, అమరావతి: ఓటుకు కోట్లు కేసు విచారణను వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాలని, ఇందులో ఏపీ ముఖ్యమంత్రి పాత్రపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ప్రత్యేక కోర్టు ఆదేశించటంతో చంద్రబాబు ఖంగుతిన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని విజయవాడ చేరుకున్నారు. అంతకుముందు తంబళ్లపల్లె నుంచి బెంగళూరు చేరే సమయంలో, అక్కడినుంచి విజయవాడకు చేరుకునేటప్పుడు ఫోన్‌లో న్యాయ నిపుణులతో, పార్టీ సీనియర్ నేతలతో ఎడతెగని సంప్రదింపులు జరిపిన ట్లు తెలిసింది. చిత్తూరు పర్యటనలో భాగంగా సోమవారం తిరుపతి పట్టణంలో ప్రజారోగ్యంపై నిర్వహించే సభలో కేంద్ర మంత్రి నడ్డాతో కలసి బాబు పాల్గొనాల్సి ఉంది. అయితే బాబు దాన్ని రద్దు చేసుకున్నారు.
తంబళ్లపల్లెలో కార్యక్రమానంతరం బెంగళూరు వెళ్లి అక్కడినుంచి విజయవాడకు చేరుకున్నారు. కాగా దారి పొడవునా.. ‘ఏసీబీ కోర్టులో పిటిషన్‌దారు ఏమని అప్పీల్ చేశారు, ఇరుపక్షాల న్యాయవాదులు ఏమి వాదనలు వినిపించారు, కోర్టు ఏమని ఉత్తర్వులు ఇచ్చింది’ తదితర అంశాల గురించే బాబు ఆరా తీసినట్లు సమాచారం. ఓటుకు కోట్లు కేసు వెలుగులోకి వచ్చి 14 నెలలు దాటింది. దీనిపై తొలుత కొంత హడావుడి జరిగినా ఆ తరువాత పురోగతి లేదు. ఈ నేపథ్యంలో కోర్టు తాజా ఆదేశాలు సంచలనం సృష్టించాయి. ఏసీబీ కోర్టు ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయిస్తే మంచిదని కొందరు న్యాయవాదులు సలహా ఇచ్చారని సమాచారం.
పార్టీ నేతలు మాత్రం దాని వల్ల రాజకీయంగా నష్టమే ఎక్కువని, ఇప్పటికే కోర్టులు విచారణకు ఆదేశిస్తే స్టే తెచ్చుకున్నామనే అపవాదు ఉందని గుర్తుచేసినట్లు సమాచారం. కోర్టును ఆశ్రయిస్తే సెప్టెంబర్ 8 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఇదే కీలకమైన అంశం అవుతుందని కూడా నేతలు చెప్పారని తెలిసింది. దీంతో కోర్టు ఆదేశాల పూర్తి కాపీ వచ్చిన తరువాత అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుందామని చెప్పిన చంద్రబాబు.. తాను ఎలాంటి ఆందోళన చెందటం లేదని చెప్పుకునేందుకన్నట్టుగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమానికి, ఆ తర్వాత దుర్గాఘాట్‌లోని కమాండ్ సెంటర్‌కు వెళ్లారు. రాష్ట్రంలో కరువు పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు.